ధోని కెరీర్‌లో మరో మైలురాయి !

MS Dhoni Set To Create History Will Join In Elite List - Sakshi

500వ మ్యాచ్‌ ఆడనున్న ధోని

సాక్షి, హైదరాబాద్‌ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన కెరీర్‌లో మరో మైలు రాయి అందుకోనున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక స్టంప్స్‌ సాధించిన వికెట్‌ కీపర్‌గా ధోని గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో టీ20.. ధోనికి 500వ (అన్ని ఫార్మాట్లలో కలిపి) అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. దీంతో ఈ అరుదైన ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ధోని కంటే ముందు భారత్‌ నుంచి దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్(664)‌, రాహుల్‌ ద్రవిడ్‌ (509)లు మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

ఓవరాల్‌గా ఈ జాబితాలో ధోని 9వ స్థానం దక్కించుకోనున్నాడు. ఈ జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, సనత్‌ జయసూర్య, రికీ పాంటింగ్‌, షాషిద్‌ అఫ్రిదీ, జక్వాస్‌ కల్లీస్‌, ద్రవిడ్‌లు ధోని కన్నా ముందున్నారు. ఇక 2014లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని వన్డే, టీ20ల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2004లో బంగ్లాదేశ్‌పై తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ధోని.. శ్రీలంకపై 2005లో టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2006లో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను సైతం ధోని ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 90 టెస్టులు, 318 వన్డేలు,91 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 331 మ్యాచ్‌లకు ధోని సారథ్యం వహించగా.. అందులో భారత్‌ 178 మ్యాచ్‌లు గెలవడం విశేషం. అతని సారథ్యంలో భారత్‌ 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 ప్రపంచకప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలను గెలుచుకోవడంతో పాటు.. 2009లో టెస్టుల్లో నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. 
చదవండి: కీపింగ్‌లో మొనగాడు ఎంఎస్‌ ధోని

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top