ఎంఎస్‌ ధోని మరో మైలురాయి

MS Dhoni 5th batsman to score 10,000 ODI runs for India - Sakshi

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్  ఎంఎస్‌ ధోని తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. భారత్‌ తరపున అంతర్జాతీయ వన్డేల్లో పదివేల పరుగుల మార్కును ధోని చేరాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు పొందాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ధోని ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 9,999 పరుగులతో ఉన్న ధోని.. పరుగు సాధించడంతో పదివేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆసీస్‌ పేసర్‌ రిచర్డ్‌సన్‌  బౌలింగ్‌లో సింగిల్‌ తీసి పదివేల క్లబ్‌లో చేరాడు. నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గడిచిన ఏడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనే ధోని ఈ మార్కును చేరాడు. అయితే, అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున ఆడి చేసినవి కావడం విశేషం. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోని 174 పరుగులు చేశాడు. తాజాగా వన్డే ఫార్మాట్‌లో భారత్‌ తరఫున పది వేల పరుగుల మార్కును ధోని అందుకున్నాడు.

కాగా, భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ , విరాట్ కోహ్లిలు మాత్రమే పది వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.  ఈ ఒక్క పరుగుని ధోని గత ఏడాది నవంబర్ నెలలో వెస్టిండిస్ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలోనే అందుకోవాల్సి ఉంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో వన్డేకి ముందు ఎంఎస్‌ ధోని పది వేల పరుగుల మార్కును చేరుకునేందుకు పరుగు దూరంలో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ధోనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. విండీస్‌ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ వికెట్‌ కోల్పోయి ఛేదించడంతో ధోని బ్యాటింగ్‌ చేసే అవసరం లేకుండా పోయింది. ఆసీస్‌తో తాజా మ్యాచ్‌ ధోనికి 333 వన్డే.  ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  289 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మూడు ప్రధాన వికెట్లను ఆరంభంలోనే కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దాంతో గోల్డెన్‌ డక్‌గా ఔటైన అపప్రథను మూటగట్టుకున్నాడు.   అటు తర్వాత విరాట్‌ కోహ్లి(3), అంబటి రాయుడు(0)లు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ తరుణంలో రోహిత్‌ శర్మతో జత కలిసిన ధోని ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top