సంచలనంతో బోణీ | Mithali Raj smashes world record as India beat England in ICC Women's World Cup opener | Sakshi
Sakshi News home page

సంచలనంతో బోణీ

Jun 25 2017 12:43 AM | Updated on Sep 5 2017 2:22 PM

సంచలనంతో బోణీ

సంచలనంతో బోణీ

ఎంతో కాలంగా ఊరిస్తోన్న ప్రపంచకప్‌లో ఈసారి భారత మహిళలు సంచలన విజయంతో తమ టైటిల్‌ వేటను ప్రారంభించారు.

ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం
మెరిసిన స్మృతి, మిథాలీ రాజ్‌
రాణించిన పూనమ్, దీప్తి శర్మ


ఎంతో కాలంగా ఊరిస్తోన్న ప్రపంచకప్‌లో ఈసారి భారత మహిళలు సంచలన విజయంతో తమ టైటిల్‌ వేటను ప్రారంభించారు. ఆతిథ్య జట్టు, మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ను బోల్తా కొట్టించి అద్భుతంగా బోణీ చేశారు. క్యాచ్‌లు వదిలేసినా.. కీలక సమయంలో భారత ఫీల్డర్లు చురుగ్గా స్పందించడంతో ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌ ‘రనౌటైంది’.  

డెర్బీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ స్మృతి మంధన (72 బంతుల్లో 90; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), పూనమ్‌ రౌత్‌ (134 బంతుల్లో 86; 7 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (73 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీస్కోరు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 47.3 ఓవర్లలో 246 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫ్రాన్‌ విల్సన్‌ (75 బంతుల్లో 81; 6 ఫోర్లు) పోరాడింది. స్మృతి మంధనకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 29న వెస్టిండీస్‌తో ఆడుతుంది.

ఓపెనర్ల దూకుడు
ఓపెనర్లు స్మృతి, పూనమ్‌ అదరగొట్టే ఆరంభమిచ్చారు. ఓవర్‌కు 5.5 రన్‌రేట్‌తో వీరి బ్యాటింగ్‌ దూకుడుగా సాగింది. తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించాక స్మృతి... హీథెర్‌నైట్‌ బౌలింగ్‌లో హాజెల్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించింది. తర్వాత పూనమ్‌కు మిథాలీ జతయ్యింది. వీళ్లిద్దరూ స్వేచ్ఛగా ఆడటంతో ఇంగ్లండ్‌ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. హీథెర్‌నైట్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి బంతికి భారత కెప్టెన్‌ ఔటయ్యింది.
ఇంగ్లండ్‌ రనౌట్‌ : భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ తొలుత తడబడినా... మ్యాచ్‌ జరిగే కొద్దీ భారత్‌ను వణికించింది. కెప్టెన్‌ హీథెర్‌నైట్‌ (46; 1 ఫోర్, 2 సిక్సర్లు), స్ఫూర్తిదాయక పోరాటం చేసిన ఫ్రాన్‌ విల్సన్‌ ‘రనౌట్‌’లతో మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసింది. విల్సన్‌కు అండగా నిలిచిన బ్రంట్‌ (24), ఆ తర్వాత జెన్నీ గన్‌ (9)లు కూడా రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమైంది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: పూనమ్‌ రౌత్‌ (సి) వ్యాట్‌ (బి) హాజెల్‌ 86; స్మృతి (సి) హాజెల్‌ (బి) హీథెర్‌నైట్‌ 90; మిథాలీ (సి) బ్రంట్‌ (బి) హీథెర్‌నైట్‌ 71; హర్మన్‌ప్రీత్‌ నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 281.
వికెట్ల పతనం: 1–144, 2–222, 3–281, బౌలింగ్‌: శ్రుబ్‌సోల్‌ 6–0–37–0, బ్రంట్‌ 7–1–50–0, సీవెర్‌ 3–1–18–0, హాజెల్‌ 10–0–51–1, జెన్నీగన్‌ 10–0–46–0, హార్ట్‌లీ 7–0–38–0, హీథెర్‌నైట్‌ 7–0–41–2.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బీమంట్‌ (సి) స్మృతి (బి) శిఖా పాండే 14; టేలర్‌ (సి) మోనా (బి) శిఖా పాండే 22; హీథెర్‌నైట్‌ రనౌట్‌ 46; సీవెర్‌ (సి) సుష్మ (బి) దీప్తి శర్మ 18; విల్సన్‌ రనౌట్‌ 81; వ్యాట్‌ (సి అండ్‌ బి) దీప్తి శర్మ 9; బ్రంట్‌ రనౌట్‌ 24; జెన్నీ గన్‌ రనౌట్‌ 9; శ్రుబ్‌సోల్‌ (సి) సబ్‌–వేద (బి) దీప్తి శర్మ 11; హాజెల్‌ (బి) పూనమ్‌ యాదవ్‌ 4; హార్ట్‌లీ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (47.3 ఓవర్లలో ఆలౌట్‌) 246.
వికెట్ల పతనం: 1–33, 2–42, 3–67, 4–134, 5–154, 6–216, 7–229, 8–229, 9–236, 10–246. బౌలింగ్‌: జులన్‌ 7–0–39–0, ఏక్తా బిష్త్‌ 9–0–43–0, శిఖా 7–1–35–2, పూనమ్‌ యాదవ్‌ 10–0–51–1, హర్మన్‌ప్రీత్‌ 6–0–27–0, దీప్తి శర్మ 8.3–0–47–3.

మిథాలీ ప్రపంచ రికార్డు
భారత కెప్టెన్‌ మిథాలీరాజ్‌ సూపర్‌ ఫామ్‌ ప్రపంచకప్‌లోనూ కొనసాగుతోంది. ఓపెనర్ల శుభారంభం అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఆమె అర్ధ శతకంతో అదరగొట్టింది. వన్డేల్లో వరుసగా అమెకిది ఏడో ఫిఫ్టీ కావడం విశేషం. ఇది మహిళల వన్డే క్రికెట్‌లో కొత్త రికార్డు. గత ఆరు మ్యాచ్‌ల్లో మిథాలీ 62 నాటౌట్, 54, 51 నాటౌట్, 73 నాటౌట్, 64, 70 నాటౌట్‌ స్కోర్లు చేసింది. గతంలో రీలర్, ఎలీస్‌పెర్రీ, చార్లోటీ ఎడ్వర్డ్స్‌ వరుసగా 6 అర్ధసెంచరీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement