మాథ్యూస్‌ మెరిసినా..

Mathews Unbeaten 85 Runs Help To Silanka 232 Runs - Sakshi

లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 233 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏంజెలో మాథ్యూస్‌(85 నాటౌట్‌)కు జతగా అవిష్కా ఫెర్నాండో(49), కుశాల్‌ మెండిస్‌(46)లు మాత్రమే మెరవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే((1), కుశాల్‌ పెరీరా(2) తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌ జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 59 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆ తరుణంలో కుశాల్‌ మెండిస్‌-ఏంజెలా మాథ్యూస్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. కాగా, కుశాల్‌ మెండిస్‌(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, జీవన్‌ మెండిస్‌ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. ధనంజయ డిసిల్వా(29) ఫర్వాలేదనిపించగా, మాథ్యూస్‌ మాత్రమే కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌ తలో మూడు వికెట్లు సాధించగా, ఆదిల్‌ రషీద్‌కు రెండు వికెట్లు లభించాయి. క్రిస్‌ వోక్స్‌ వికెట్‌ తీశాడు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top