సిలిచ్‌ నిష్క్రమణ

Marin Cilic beaten by Guido Pella in second round - Sakshi

మూడో రౌండ్‌కు నాదల్, జొకోవిచ్‌ 

వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ 

లండన్‌: గతేడాది రన్నరప్, క్రొయేషియా స్టార్‌ మారిన్‌ సిలిచ్‌కు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో రెండోరౌండ్లోనే చుక్కెదురైంది. ఇది మినహా నాలుగో రోజు మిగతా సీడెడ్‌ ఆటగాళ్లంతా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పానిష్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్, సెర్బియన్‌ జొకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ హలెప్, ఎంజెలిక్‌ కెర్బర్‌ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. భారత ఆటగాళ్లలో దివిజ్‌ శరణ్‌ జోడీ శుభారంభం చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ రన్నరప్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనలిస్ట్‌ సిలిచ్‌ ఈ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. మూడో సీడ్‌ క్రొయేషియా ఆటగాడు 6–3, 6–1, 4–6, 6–7 (3/7), 5–7తో గుయిడో పెల్లా (అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. 3 గంటల 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సిలిచ్‌కు ముచ్చెమటలు పట్టించిన పెల్లా చివరకు అతన్ని ఇంటిదారి పట్టించాడు. రెండో సీడ్‌ నాదల్, జొకోవిచ్‌లు అలవోక విజయాలతో ముందంజ వేశారు.

రెండో రౌండ్లో నాదల్‌ 6–4, 6–3, 6–4తో మిఖాయిల్‌ కుకుష్కిన్‌ (కజకిస్తాన్‌)పై, 12వ సీడ్‌ జోకొవిచ్‌ 6–1, 6–2, 6–3తో జెబల్లొస్‌ (అర్జెంటీనా)పై గెలిచారు. 9వ సీడ్‌ ఇస్నర్‌ (అమెరికా) 6–1, 6–4, 6–7 (6/8), 6–7 (3/7), 7–5తో బెమెల్మన్స్‌ (బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6–7 (7/9), 3–6, 6–7 (6/8) థామస్‌ ఫెబియానో (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో టాప్‌ సీడ్‌ హలెప్‌ (రుమేనియా) 7–5, 6–0తో ససై జెంగ్‌ (చైనా)పై, 11వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) 3–6, 6–2, 6–4తో క్లెయిర్‌ లియూ (అమెరికా)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్లో దివిజ్‌ శరణ్‌–అర్టెమ్‌ సిటక్‌ (న్యూజిలాండ్‌) జోడీ 7–6 (7/4), 6–7 (8/10), 6–3, 6–2తో అల్బొట్‌ (మాల్డొవా)–మలెక్‌ జజిరి (ట్యూనిషియా) ద్వయంపై గెలిచింది. విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జంట 7–6 (7/5), 6–4, 7–6 (7/4)తో డానియెల్‌ (న్యూజిలాండ్‌)– వెస్లీ కూల్‌హోఫ్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై గెలుపొందగా, జీవన్‌ నెడున్‌జెళియన్‌ (భారత్‌)–క్రాజిసెక్‌ (అమెరికా) జోడీ 6–7 (5/7), 6–7 (3/7), 6–7 (2/7)తో అరెండ్స్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జంట చేతిలో ఓడిపోయింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top