‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా మన్‌ప్రీత్‌ సింగ్‌ 

Manpreet Singh Got Player Of The Year Award - Sakshi

ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్‌గా రికార్డు 

లుసానే: భారత పురుషుల హాకీ జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించిన సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.పురుషుల విభాగంలో  2019 ఏడాదికి గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెల్చుకున్నాడు. దాంతో ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డు కోసం బెల్జియం ప్లేయర్‌ ఆర్థర్‌ వాన్‌ డోరెన్, అర్జెంటీనా ఆటగాడు లుకాస్‌ విల్లాలు పోటీ పడగా... పోలైన మొత్తం ఓట్లలో 35.2 శాతం ఓట్లను దక్కించుకున్న మన్‌ప్రీత్‌ విజేతగా నిలిచాడు. ఆర్థర్‌ 19.7 శాతం, లుకాస్‌ 16.5 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ అవార్డును తన జట్టు సభ్యులకు అంకితమిస్తున్నట్లు మన్‌ప్రీత్‌ తెలిపాడు. 2019లో తమ ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే అని... రష్యాతో జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా ఒలింపిక్‌ కల నెరవేరిందని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు.

2011లో భారత సీనియర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేసిన మన్‌ప్రీత్‌ సింగ్‌ ఇప్పటి వరకు 263 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడాడు. అంతే కాకుండా 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌ల్లో భారత్‌కు ఆడాడు. 2017లో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇక వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా 2019లో భారత హాకీ జట్టుకు అద్వితీయమైన విజయాలను అందించాడు. భువనేశ్వర్‌ వేదికగా జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ చాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టడంతో పాటు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తును ఖాయం చేశాడు. వీటితో పాటు టోక్యోలో జరిగిన ఒలింపిక్‌ టెస్టు ఈవెంట్‌ విజేతగా... సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ ఫైనల్స్‌కు భారత్‌ను చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే మన్‌ప్రీత్‌తో పాటు భారత యువ మిడ్‌ఫీల్డర్‌ వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ ‘రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ఇదే అవార్డును భారత ప్లేయర్‌ లాల్‌రెమ్‌సియామి గెల్చుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top