'అది టీమిండియా జట్టుకే హానికరం' | Sakshi
Sakshi News home page

'అది టీమిండియా జట్టుకే హానికరం'

Published Mon, Jan 25 2016 3:35 PM

'అది టీమిండియా జట్టుకే హానికరం'

సిడ్నీ:ఒక క్రికెట్ జట్టులో ఎక్కువకాలం ఒకే వ్యక్తిని కెప్టెన్ గా కొనసాగించడం అంత మంచి పద్ధతి కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా వన్డే కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనికి సుదీర్ఘ బాధ్యతలు అప్పజెప్పడంపై ఇయాన్ స్పందించాడు.  పరిమిత ఓవర్ల సారథిగా ధోనినే ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల భారత క్రికెట్ జట్టు  ప్రయోజనాలకు చేటు తెస్తుందన్నాడు.  ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ ఉండటం మంచిదే కానీ, ఆ బాధ్యతను ఒకరి మీదే ఎక్కువ కాలం వదిలేయడం జట్టుకు కచ్చితంగా హాని చేస్తుందన్నాడు.  విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకోవడమే అతన్ని బయటకు పంపడానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నాడు.

 

ప్రస్తుత టీమిండియా జట్టు వ్యూహ రచనలో చాలా బలహీనంగా ఉందని, వివిధ పరిస్థితుల్లో కొత్త ప్రణాళికలతో దూసుకెళితేనే విజయాలు సాధ్యమన్నాడు. ఆసీస్ గెలిచిన నాలుగు వన్డేల్లో ప్రత్యర్థి జట్టు దాదాపు 1,300  పరుగులు సమర్పించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చాపెల్ గుర్తు చేశాడు. ఆస్ట్రేలియాలోని ఫ్లాట్ పిచ్ ల్లో  టీమిండియా బౌలింగ్ ఆకట్టుకోలేదన్నాడు. టీమిండియా జట్టు వన్డే కెప్టెన్ గా విరాట్ కోహ్లికి బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మెట్ లో నిరూపించుకున్న కోహ్లిని పరిమిత ఓవర్ల నాయకుడిగా నియమిస్తే జట్టు సరికొత్త ఆలోచనలతో తీర్చిదిద్దగలడని ఇయాన్ చాపెల్ తెలిపాడు.

Advertisement
Advertisement