8 వారాల తర్వాత.. హెసన్‌‌ భావోద్వేగం

Lockdown : Mike Hesson Reunites With Family In New Zealand After Returning From India - Sakshi

ఆక్లాండ్‌ : న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో మనసును కదిలించేలా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన హెసన్‌‌.. దాదాపు 8 వారాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రాయల్‌ చాలెంజర్స్‌ డైరెక్టర్‌గా ఉన్న హెసన్‌ భారత్‌లో లాక్‌డౌన్‌ విధించే సమయంలో‌ బెంగళూరులో ఉండిపోయాడు. ఆ తర్వాత భారత్‌లో లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడిగించారు. (చదవండి : మరోసారి వార్తల్లో శుభ్‌మన్‌, సారా టెండూల్కర్)

అయితే న్యూజిలాండ్‌లో ఏప్రిల్‌ చివరివారంలో లాక్‌డౌన్‌ సడలింపులు ప్రకటించడంతో.. హెసన్‌ తన స్వదేశానికి బయలు దేరాడు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ముంబై చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో న్యూజిలాండ్‌ వెళ్లాడు. అక్కడ 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉన్న తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తన చిన్న కుమార్తెను హగ్‌ చేసుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హెసన్‌.. భావోద్వేగానికి గురయ్యాడు. లాక్‌డౌన్‌లో 8 వారాల తర్వాత తన కుమార్తెను హగ్‌ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని హెసన్‌ పేర్కొన్నారు. 

అంతకుముందు లాక్‌డౌన్‌ సమయంలో తన ప్రయాణానికి అనుమతించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌లకు హెసన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత నెలలో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్‌ చేసిన హెసన్‌.. వారిని మిస్‌ అవుతున్నట్టు పేర్కొన్నారు. తను కరోనా సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top