
వరుసగా 26వ ఏడాది... పేస్ ఖాతాలో మరో టైటిల్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొంత విరామం తర్వాత మరో టైటిల్‌ను గెలుచుకున్నాడు.
లియోన్ (మెక్సికో): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొంత విరామం తర్వాత మరో టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇక్కడ జరిగిన లియోన్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను పేస్ చేజిక్కించుకున్నాడు. తాజా విజయంతో గత 26 ఏళ్లుగా పేస్ ప్రతీ సంవత్సరం ఏటీపీ సర్క్యూట్‌లో కనీసం ఒక టైటిల్‌ను సొంతం చేసుకున్నట్లయింది.
ఫైనల్లో పేస్–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జోడీ 6–1, 6–4తో ల్యూకా మార్గరోలి (స్విట్జర్లాండ్)–కారో జంపీరీ (బ్రెజిల్) జంటను చిత్తు చేసింది. పేస్ కెరీర్‌లో ఇది 20వ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ కాగా... ఈ సీజన్‌లో మొదటిది. 2017లో దుబాయ్ చాంపియన్‌షిప్, డెల్‌రే బీచ్ ఓపెన్‌లలో సెమీస్ వరకు చేరిన పేస్... ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచాడు. టైటిల్ నెగ్గిన పేస్–షమస్దీన్ జోడీకి 4,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.