ఇంకా ఆడుతున్నాడు... గెలుస్తున్నాడు

Leander Paes feels blessed to have long career - Sakshi

46 ఏళ్ల లియాండర్‌ పేస్‌ గురించి నాదల్‌తో కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌. వయసులో ఫిఫ్టీకి చేరువవుతున్నా... వన్నె తగ్గని ఈ వెటరన్‌ స్టార్‌ టోక్యో ఒలింపిక్స్‌పై కూడా దృష్టి పెట్టాడు. 46 ఏళ్ల పేస్‌  ప్రస్తుతం ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడుతున్నాడు. పురుషుల డబుల్స్‌లో స్థానిక భాగస్వామి బెనోయిట్‌ పెయిర్‌తో కలిసి శుభారంభం చేశాడు. టెన్నిస్‌లో ఓపెన్‌ శకం మొదలయ్యాక మ్యాచ్‌ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా పేస్‌ నిలిచాడు. తన కీర్తి కిరీటంలో చేరిన ఈ ఘనతపై అతను మాట్లాడుతూ ‘30 ఏళ్లుగా టెన్నిస్‌ ఆడుతున్నా. నా సుదీర్ఘ ప్రస్థానంలో 12 తరాల ఆటగాళ్లను చూశా. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ పీట్‌ సంప్రాస్, ప్యాట్‌ రాఫ్టర్‌లు సింగిల్స్‌ ఆడితే... నేను డబుల్స్‌ ఆడాను. టెన్నిస్‌లో నాకంటూ గౌరవాన్ని సంపాదించుకున్నాను’ అని అన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సందర్భంగా...రాఫెల్‌ నాదల్, అతని మాజీ కోచ్‌ టోనీ ఎదురుపడినపుడు ఆసక్తికర సంభాషణ జరిగిందన్నాడు.

‘నేను నా డబుల్స్‌ మ్యాచ్‌ ముగించుకొని వస్తుంటే వాళ్లిద్ద రూ ఎదురయ్యారు. నన్ను గుర్తించిన కోచ్‌ టోనీ... లియో (పేస్‌) నీకు 46 ఏళ్ల వయసు కదా! అంటే ఔనన్నా. రొలాండ్‌ గారోస్‌లో 1989 (జూనియర్స్‌), తర్వాత సీనియర్స్‌ ఆడావుగా అంటే ఔననే చెప్పా.  ఇన్నేళ్లయినా మళ్లీ ఇక్కడ తొలి గేమ్‌ గెలిచావంటా... అంటే ఔననే తల ఊపాను. వెంటనే నాదల్‌తో చూశావా నాదల్‌... 46 వయసులో పేస్‌ ఆడటమే కాదు గెలవడం కూడా చేస్తున్నాడు’ అని చెప్పారు. ఓ మేటి కోచ్‌ మరో దిగ్గజ ఆటగాడు (నాదల్‌)తో తన గురించి చెబుతుంటే ఎంతో సంతోషం కలిగిందన్నాడు. టెన్నిస్‌లో అప్పటి దిగ్గజాల నుంచి ఇప్పటి గ్రేటెస్ట్‌ స్టార్ల వరకు అందరూ తనను గుర్తిస్తారని, గౌరవంతో చూస్తారని పేస్‌ చెప్పుకొచ్చాడు. నాదల్, రోజర్‌ ఫెడరర్‌లిద్దరూ తనకు టీనేజ్‌ వయసు నుంచే తెలుసని చెప్పాడు. ‘నా జీవితంలో టెన్నిస్‌తో నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడైతే (ఫ్రెంచ్‌ ఓపెన్‌లో) నాలుగు సార్లు డబుల్స్‌ టైటిల్‌ సాధించాను. అలసట ఎరుగని నా పయనంలో ఆటను ఇప్పుడప్పుడే ఆపలేను. 2020 ఒలింపిక్స్‌ కూడా ఆడేస్తానేమో. ఇప్పటికే అత్యధిక ఒలింపిక్స్‌ (6) ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాను. మరోటి ఆడితే ఆ రికార్డును మెరుగుపరుచుకుంటా’ అని పేస్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top