లంక అంతర్జాతీయ జట్టేనా? | Lanka International team or not ? | Sakshi
Sakshi News home page

లంక అంతర్జాతీయ జట్టేనా?

Aug 14 2017 12:56 AM | Updated on Sep 12 2017 12:00 AM

తొలి రెండు టెస్టుల మాదిరిగానే మూడో మ్యాచ్‌లోనూ శ్రీలంక తేలిపోయింది.

తొలి రెండు టెస్టుల మాదిరిగానే మూడో మ్యాచ్‌లోనూ శ్రీలంక తేలిపోయింది. ప్రదర్శన పరంగా భారత్‌తో ఏ విభాగంలోనూ లంక పోటీనివ్వడంలేదు. ఒక టెస్టు మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో ఓ జట్టు 38 ఓవర్లు కూడా బ్యాటింగ్‌ చేయలేకపోతే ఆ జట్టును అంతర్జాతీయ జట్టుగా పరిగణించాల్సిన అవసరం లేదు. మందకొడిగా ఉన్న ఫ్లాట్‌ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎన్ని పరుగులు చేస్తుందనేది అప్రస్తుతం. ఆ జట్టులో అసలు పోరాట పటిమనే కనిపించడంలేదు. వారి ఆటతీరు చూస్తుంటే ఈ పోటీని టెస్టు మ్యాచ్‌ అనాలనిపించడంలేదు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు కనిపించలేదు. అయితే ఇక్కడ లంక బ్యాట్స్‌మెన్‌ ఆటతీరు తీసికట్టుగా ఉంది. వారి బౌలింగ్‌ అయితే ప్లేట్‌ గ్రూప్‌లోని రంజీ జట్టుతో కూడా పోల్చలేం.

మరోవైపు శిఖర్‌ ధావన్‌ మరోసారి సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక హార్దిక్‌ పాండ్యా మెరుపు సెంచరీ సాధించి టెస్టుల్లో ఇంత అలవోకగా కూడా శతకం కొట్టొచ్చని నిరూపించాడు. లంక బౌలింగ్‌లో పదును లేకపోయినా పాండ్యా సెంచరీని తక్కువ చేసి చూడలేం. బంతితో కూడా పాండ్యా ఆకట్టుకున్నాడు. మాథ్యూస్‌ వికెట్‌ను తీయడంతోపాటు ఓ క్యాచ్‌ కూడా తీసుకొని రెండో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా సస్పెండ్‌ కావడంతో అతని స్థానంలో తుది జట్టులో స్థానం పొందిన కుల్దీప్‌ యాదవ్‌ తన ఎంపికకు న్యాయం చేశాడు. రెండేళ్ల క్రితం స్వాతంత్య్ర దినోత్సవం రోజున శ్రీలంక చేతిలో తొలి టెస్టులో భారత్‌ ఓడిపోయింది. ఈసారి మాత్రం టీమిండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను.  
సునీల్‌ గావస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement