
కుల్దీప్ యాదవ్
మాంచెస్టర్ : తన ప్రణాళిక విజయవంతంగా అమలు కావడంతోనే 5 వికెట్లు దక్కాయని టీమిండియా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లిసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను కుల్దీప్ 5 వికెట్లతో దెబ్బతీశాడు. మ్యాచ్ అనంతరం ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మాట్లాడుతూ.. ‘పిచ్‌పై బంతి తిరగడం లేదనే విషయాన్ని నాకన్న ముందు బౌలింగ్ చేసిన చహల్ ఓవర్లోనే అర్థమైంది. అలాంటప్పుడు పేస్ బంతులేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రెచ్చిపోతారని తెలుసు. దీంతో ప్రత్యేకమైన పేస్‌తో కూడిన బంతులేసాను. అవి విజయవంతమవడంతో 5 వికెట్లు దక్కాయి. బ్యాట్స్‌మన్ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ బౌలింగ్ చేయను. ఏం చేయాలనే దానిపైన మాత్రమే దృష్టిసారిస్తాను. కొన్ని సార్లు బ్యాట్స్‌మన్‌ను సైతం పరిగణలోకి తీసుకొవాల్సి ఉంటుంది. జోస్ బట్లర్‌కు బౌలింగ్ చేసేటప్పుడు అదే చేశాను. అతని గురించి నాకు పూర్తిగా తెలుసు. ఐపీఎల్‌లో అతనికి చాలా సార్ల బౌలింగ్ చేశాను. బట్లర్ నా బౌలింగ్‌లో రిస్క్ తీసుకోకుండా కేవలం సింగిల్స్‌కు ప్రయత్నిస్తాడన్న విషయం కూడా తెలుసు. అతనికి నేను సంతోషంగా సింగిల్స్ ఇస్తాను.’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.
హేల్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్.. 14 ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌కు ధోని మాస్టర్ కీపింగ్ తోడవ్వడంతో ఏకంగా ఈ ఓవర్‌లో మోర్గాన్(8), బెయిర్ స్టో(0), రూట్(0)ల వికెట్లు దక్కాయి. దీంతో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి ఎడమ చేతివాటం బౌలర్‌గా కుల్దీప్ రికార్డు నమోదు చేశాడు. ఇక 160 పరుగుల లక్ష్యాన్ని భారత్.. కేఎల్ రాహుల్ (101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ సెంచరీతో సునాయసంగా చేధించింది.