‘పాక్‌ క్రికెట్‌ జట్టుపై చర్యలు తీసుకోండి’

Kamran Akmal Asks to Take Stern Action Against Pakistan Team - Sakshi

ఇస్లామాబాద్‌: ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్‌ జట్టుపై విమర్శలు ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాక్‌ క్రికెట్‌ జట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ విజ్ఞప్తి చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి దేశం పరువుతీసిన ఆటగాళ్లను సాగనంపాలన్నారు. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ దారుణంగా విఫలమయ్యాడని విమర్శించారు.

‘ప్రపంచకప్‌ టోర్నిలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ ఛేజింగ్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసి విజయం సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయి 105కే ఆలౌటైంది. మన బ్యాటింగ్‌ దారుణంగా ఉంది. మన లోపాలను ప్రత్యర్థులు సోపానాలుగా మలుచుకున్నార’ని అక్మల్‌ మండిపడ్డాడు. పాకిస్తాన్‌లో సమర్థులైన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసి బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలను పటిష్టం చేసివుంటే పాక్‌ క్రికెట్‌ జట్టు మెరుగైన ప్రదర్శన చేసివుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై లోతుగా సమీక్ష చేస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఇంతకుముందు ప్రకటించింది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top