ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా...

Japanese test awaits Indian Men's Hockey Team on their Road to Tokyo - Sakshi

నేడు జపాన్‌తో భారత్‌ సెమీఫైనల్‌

గెలిస్తే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి అర్హత  

భువనేశ్వర్‌: ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు భారత హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. ఆసియా క్రీడల చాంపియన్‌ జపాన్‌తో నేడు జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) సిరీస్‌ ఫైనల్స్‌ సెమీఫైనల్లో భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. కొత్త కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ శిక్షణలో ఇప్పటికే గ్రూప్‌ మ్యాచ్‌లను భారీ గోల్స్‌ తేడాతో గెలవడం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గ్రూప్‌ మ్యాచ్‌లలో రష్యా, ఉజ్బెకిస్తాన్‌లపై 10–0తో, పోలాండ్‌పై 3–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ముఖ్యంగా భారత మిడ్‌ఫీల్డ్‌ చురుకుగా కదులుతూ గోల్స్‌ చేసే అవకాశాలను సృష్టిస్తోంది. అయితే ఆ అవకాశాలను గోల్స్‌గా మలచడంలో కాస్త ఇబ్బంది పడుతున్నా సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌గా కనబడుతోంది. ‘మా జట్టు ఆటతీరు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. గోల్స్‌ చేసే అవకాశాలను సృష్టిస్తున్నా కొన్నిసార్లు వాటిని లక్ష్యానికి చేర్చడంలో తడబడుతున్నారు. ఈ అంశంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని కోచ్‌ గ్రాహమ్‌ అన్నారు. చివరిసారిగా జపాన్‌తో ఈ ఏడాది జరిగిన అజ్లాన్‌ షా టోర్నీలో తలపడిన భారత్‌ 2–0తో విజయాన్ని అందుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top