
అడిలైడ్:ఇంగ్లండ్ ప్రధాన పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరో బౌలింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే ఇంగ్లండ్ తరపున టెస్టుల‍్లో నాలుగు వందల వికెట్లతో పాటు ఐదు వందల వికెట్లను సాధించిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించిన అండర్సన్.. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మరో రికార్డును సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఎనిమిది వందల వికెట్లు సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా కూడా ఘనత సాధించాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన అండర్సన్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆసీస్ క్రికెటర్ పీటర్ హ్యాండ్‌స్కాంబ్ వికెట్ ను తీయడం ద్వారా 800వ వికెట్ మార్కును అండర్సన్ చేరుకున్నాడు. టెస్టుల్లో 514 వికెట్లు సాధించిన అండర్సన్.. వన్డేల్లో 269 వికెట్లను నేలకూల్చాడు. ఇక టీ 20ల్లో 18 వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. మరొకవైపు టెస్టులో ఐదు వికెట్ల మార్కును 25సార్లు సాధించిన అండర్సన్.. ఆస్ట్రేలియాలో ఐదు వికెట్లను సాధించడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంచితే, అండర్సన్ దెబ్బకు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. అతనికి క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో చక్కటి సహకారం అందించాడు. 53/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆట కొనసాగించిన ఆసీస్.. మరో 85 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లలో ఉస్మాన్ ఖాజా(20), మిచెల్ స్టార్క్(20)లదే అత్యదిక స్కోరు కావడం గమనార్హం.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 442/8 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 138 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 227 ఆలౌట్