ఈ వానేదో అక్కడ పడొచ్చు కదా: జాదవ్‌

Jadhav Pleads Nottingham Rain To Go To Maharashtra - Sakshi

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను ఊహించినట్లుగానే వరుణుడు అడ్డుకున్నాడు. నాటింగ్‌హామ్‌లో బుధవారం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. మైదాన సిబ్బంది పిచ్‌ తడవకుండా తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ అవుట్ ఫీల్డ్‌ మాత్రం తడిసి ముద్దయింది. దీంతో మ్యాచ్‌ జరిగే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకు చెరోపాయింట్‌ ఇచ్చారు. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా మ్యాచ్‌ రద్దవడానికి కంటే ముందు టీమిండియా క్రికెటర్లు మ్యాచ్‌ ప్రారంభం కోసం బాల్కనీ నుంచి ఆత్రుతగా ఎదురుచూశారు. రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌లు బ్రెడ్‌ ఆమ్లెట్‌ తింటూ వర్షాన్ని ఎంజాయ్‌ చేశారు. అయితే కివీస్‌తో మ్యాచ్‌కు వర్షం పడటం పట్ల కేదార్‌ జాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వర్షం నాటింగ్‌హామ్‌లో కాకుండా మహారాష్ట్రలో పడాలని కోరుకున్నాడు. గత ​కొన్ని నెలలుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోన్న కారణంగానే జాదవ్‌ అలా కోరుకున్నాడు. 

ఇక మహారాష్ట్రలో రోజురోజుకి నీటి సమస్య జఠిలమవుతోంది. మరాఠ్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రతోపాటు అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. పరిణామంగా అనేక ప్రాంతాల్లో సాగునీటితోపాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top