ఇషాంత్‌ శర్మ ఫిట్‌ 

Ishant Sharma Passes Fitness Test - Sakshi

న్యూజిలాండ్‌ వెళ్లనున్న భారత పేస్‌ బౌలర్‌

ముంబై: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు శుభవార్త! గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ శనివారం ఫిట్‌నెస్‌ పరీక్షలో సఫలమయ్యాడు. దాంతో అతను న్యూజిలాండ్‌ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ఆదివారం ఇషాంత్‌ నేరుగా తొలి టెస్టు వేదిక అయిన వెల్లింగ్టన్‌కు బయల్దేరతాడు. విదర్భతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా జనవరి 21న ఇషాంత్‌ కాలికి గాయమైంది.

ఎంఆర్‌ఐ స్కాన్‌లో ‘గ్రేడ్‌ త్రీ టియర్‌’గా తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి, పునరావాస చికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దాంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ చేరుకున్న ఇషాంత్‌ అక్కడే ఫిట్‌గా మారాడు. ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌ అయిన అనంతరం ఇందుకు సహకరించిన ఫిజియో ఆశిష్‌ కౌశిక్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో ముందు జాగ్రత్తగా బీసీసీఐ సెలక్టర్లు ఇషాంత్‌ పేరును కూడా చేర్చారు. అతను ఫిట్‌నెస్‌ పరీక్షలో సఫలమైతే టీమిండియాతో చేరతాడని ప్రకటించారు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 96 టెస్టులు ఆడిన ఇషాంత్‌ ‘సెంచరీ’కి కేవలం నాలుగు టెస్టుల దూరంలో ఉన్నాడు. అతను వంద టెస్టుల మైలురాయిని చేరుకుంటే కపిల్‌దేవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత పేస్‌ బౌలర్‌గా నిలుస్తాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top