వికెట్లతో పాటు ట్రోఫీ సాధించాలి!

IPL 2020: Dale Steyn Confident RCB Will Win - Sakshi

బెంగళూరు:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 13కు సంబంధించి జరిగిన ఆటగాళ్ల వేళంలో దక్షిణాఫ్రికా వెటరన్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. కనీస ధర రూ. 2కోట్లకు స్టెయిన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ జట్టులో తిరిగి చేరడంపై స్టెయిన్‌ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

అంతేకాకుండా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు స్టెయిన్‌ తన దైన స్టైల్లో సమాధానాలిచ్చాడు. ఈ సారైనా ఆర్సీబీ ఐపీఎల్‌-2020 ట్రోఫీ గెలుస్తుందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా..‘తప్పక గెలుస్తుంది. ఎందుకుంటే అక్కడ ఉంది నేను’అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా ‘ఈసారి వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలి. వికెట్లతో పాటు ట్రోఫీ సాధించి తీరాలి’అంటూ మరో ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ‘ఆనందంతో పాటు బాధ్యత పెరిగింది’అంటూ ఫ్యాన్స్‌ అడిగిన దానికి బదులిచ్చాడు ఈ స్పీడ్‌గన్‌.

ఇక స్టెయిన్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేసింది ఆర్సీబీ జట్టులో అయినప్పటికీ.. ఆ జట్టుకు తొమ్మిదేళ్ల దూరంగా ఉన్నాడు. తిరిగి ఐపీఎల్‌-2019లో బెంగళూరు​ జట్టులో చేరినప్పటికీ రెండు మ్యాచ్‌ల అనంతరం గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. అయితే తాజా వేలానికి ముందు స్టెయిన్‌ను ఆర్సీబీ వదులుకుంది. కానీ వేలంలో అనూహ్యంగా తిరిగి చేజిక్కించుకుంది. స్టెయిన్‌తో పాటు రిచర్డ్‌సన్‌, మోరిస్‌, ఉదానలతో ఆర్సీబీ బౌలింగ్‌ దుర్బేద్యంగా ఉంది. ఇప్పటికే బ్యాటింగ్‌లో దుమ్ములేపే కోహ్లి జట్టు బౌలింగ్‌ బలం పెరగడంతో వచ్చే సీజన్‌లో హాజ్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. 

కోహ్లితో చర్చించే తీసుకున్నాం: మైక్ హెసన్‌
‘వేలం ప్రారంభానికి ముందే అనుకున్నాం స్టెయిన్‌ అవసరం ఆర్సీబీకి ఉందని, అయితే అతడు కనీసం రూ. 3నుంచి 4 కోట్లు పలుకుతాడని భావించాం. కానీ మేము ఊహించింది జరగలేదు. లక్కీగా స్టెయిన్‌ను వేలంలో చేజిక్కించుకున్నాం. బౌలర్ల ఎంపిక విషయంలో సారథి కోహ్లితో పదేపదే చర్చించాం. మిడిల్‌ ఓవర్లలో మంచి బౌలర్‌ కావాలని అతడు కోరాడు. అందుకోసం ఉదాన సరైన వ్యక్తిగా భావించాం. దీంతో స్టెయిన్‌, ఉదానలను ఎంపిక చేశాం’అని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌ మైక్ హెసన్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top