క్రికెట్‌లో ఆ నిబంధన తీసేస్తే సరి?

IPL 2019 Vaughan Suggests to Solve Zinger Bails Woes - Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ‘మన్కడింగ్‌’ వివాదం రచ్చ లేపగా.. తాజాగా మరో నిబంధన తీవ్ర చర్చనీయాంశమైంది. ‘బంతి వికెట్లను తాకినా బెయిల్స్‌ కింద పడితేనే బ్యాట్స్‌మన్‌ అవుట్‌’ అనే నిబంధనపై క్రీడా పండితులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఏకంగా మూడు సంఘటనలు జరగడంతో ఈ నిబంధన తొలిగిస్తే మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొట్టి ఫార్మట్‌లో నిబంధనలు బౌలర్‌కు అనుకూలంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు. 

తాజాగా ఈ నిబంధనపై ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకెల్‌ వాన్‌ స్పందించాడు. ‘బౌలర్‌ వేసిన అద్భుత బంతి బ్యాట్స్‌మన్‌ను తప్పించుకుంటూ వికెట్‌ను తాకింది. అయితే కేవలం బెయిల్స్‌ పడనంత మాత్రానా బ్యాట్స్‌మన్‌ అవుట్‌ కాదని ఆనడం హాస్యాస్పదం. ఈ నిబంధన తీసేస్తేనే క్రికెట్‌కు మంచిది’అంటూ వాన్‌ పేర్కొన్నాడు. ఈ నిబంధనతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎక్కువగా నష్టపోయింది రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు. ఆదివారం కోల్‌కతా‌-రాజస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. అయితే కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ సందర్బంగా.. క్రిస్‌లిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ధవల్‌ కులకర్ణి వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతి.. వికెట్లను తాకింది. కానీ బెయిల్స్‌ కిందపడలేదు. విచిత్రంగా ఆ బంతి బౌండరీ వెళ్లింది. దీంతో క్రిస్‌లిన్‌ బతికిపోగా.. కోల్‌కతాకు నాలుగు పరుగులు లభించాయి. ఇక ఆ సమయంలో క్రిస్‌లిన్‌ కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దొరికిన ఈ అవకాశంతో చెలరేగిపోయాడు. హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మార్చి 31న చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాజస్తాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని అద్భుత అర్దశతకంతో జట్టుకు విజయాన్నందించాడు. అయితే ధోని మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఆర్చర్‌ బౌలింగ్‌లో ధోని డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి ధోని పాదాలకు తాకి వికెట్‌ను తాకింది. కానీ బెయిల్స్‌ మాత్రం కింద పడలేదు. దీంతో ధోని ఊపిరిపీల్చుకున్నాడు. కింగ్స్‌ పంజాబ్‌-చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని కొట్టిన బంతి వికెట్లకు తాకినప్పటికి బెయిల్స్‌ కిందపడలేదు. దీంతో కేఎల్‌ రాహుల్‌కు లైఫ్‌ లభించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐపీఎల్‌లో వాడుతున్న బెయిల్స్‌ ఫెవికాల్‌ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

చదవండి:
‘ధోనీనా మజాకా.. ఆఖరికి బెయిల్స్‌ కూడానా!’
వైరల్‌: ధోని గురి అదిరింది కానీ..
బెయిల్స్‌ పడకపోతే ఫోర్‌ ఇస్తారా?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top