వైరల్‌: ధోని గురి అదిరింది కానీ.. | MS Dhoni Gets Unlucky With No Look Throw | Sakshi
Sakshi News home page

వైరల్‌: ధోని గురి అదిరింది కానీ..

Apr 7 2019 2:38 PM | Updated on Apr 7 2019 3:52 PM

MS Dhoni Gets Unlucky With No Look Throw - Sakshi

చెన్నై: కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌తో శనివారం చేపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సమిష్టిగా రాణించి అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ అదృష్టంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని సింగిల్‌ తీయడానికి రాహుల్‌ ప్రయత్నించగా.. ధోని తనదైన మార్క్‌ కీపింగ్‌తో వేగంగా బంతిని వికెట్లకు కొట్టాడు. రాహుల్‌ వెనక్కి వచ్చినా బంతి వికెట్లను తాకే సమయానికి క్రీజును చేరలేదు. కానీ ధోని దురదృష్టమో.. రాహుల్‌ అదృష్టమో కానీ బెల్స్‌ కిందపడలేదు. బంతి ఒక్కసారి వికెట్లను తాకి లైట్స్‌ వెలగడంతో చెన్నై ఆటగాళ్లు రాహుల్‌ ఔటయ్యాడని ఫిక్సయ్యి సంబరాలు చేసుకున్నారు. స్లిప్‌లో ఫీల్డింగ్‌ ఉన్న అంబటి రాయుడైతే ఏకంగా బంతిని వదిలేసి ధోని దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. చివరకు బెల్స్‌ కిందపడలేదని తెలుసుకొన్న చెన్నై ఆటగాళ్లంతా షాక్‌కు గురయ్యారు. ఇంతలో రాహుల్‌ తన పరుగును పూర్తి చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాహుల్‌ 12వ ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

ఇక టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (38 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్‌ ధోని (23 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. రాహుల్‌ (47 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (59 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం వృథా అయింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్భజన్, కుగ్లీన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement