బెయిల్స్‌ పడకపోతే ఫోర్‌ ఇస్తారా?

Ajinkya Rahane suggests to declare zing bails fail as a dead ball - Sakshi

జైపూర్‌ : కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించిన కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా.. ఓపెనర్లు సునీల్‌ నరైన్‌(47), క్రిస్‌ లిన్‌(50) చెలరేగడంతో 37 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే కోల్‌కతా ఇన్నింగ్స్‌ సందర్బంగా విచిత్ర ఘటన చోటుచేసుకుంది. క్రిస్‌లిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ధవల్‌ కులకర్ణి వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతి.. వికెట్లను తాకింది. కానీ బెయిల్స్‌ కిందపడలేదు. విచిత్రంగా ఆ బంతి బౌండరీ వెళ్లింది. దీంతో క్రిస్‌లిన్‌ బతికిపోగా.. కోల్‌కతా నాలుగు పరుగులు లభించాయి. అయితే అంపైర్‌ ఫోర్‌ ఇవ్వడంపై మైదానంలోనే కెప్టెన్‌ అజింక్యా రహానే అభ్యంతరం చెప్పాడు. అంపైర్లతో చర్చించాడు. ఇక మ్యాచ్‌ అనంతరం అంపైర్లతో తాను జరిపిన సంభాషణ గురించి వివరణ ఇచ్చాడు. బంతి వికెట్లను తాకి బౌండరీ వెళ్తే ఎలా ఫోర్‌ ఇస్తారని ప్రశ్నించాడు. కనీసం దాన్ని డెడ్‌బాల్‌గానైనా ప్రకటించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

‘నిబంధనలు..నిబంధనలే. కనీసం ఫోర్‌ అన్నా ఇవ్వకండని అంపైర్లకు చెప్పాను. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌ బౌలర్లకు కష్టంగా మారింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనైనా బౌలర్స్‌కు ఫేవర్‌గా ఆ బంతిని డేడ్‌ బాల్‌ ఇవ్వాలని అంపైర్లను కోరాను’ అని రహానే వివరించాడు. ఇక క్రిస్‌లిన్‌ ఆ సమయంలో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దొరికిన ఈ అవకాశంతో చెలరేగిపోయాడు. హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనపై స్పందిస్తూ.. తాను చాలా అదృష్టవంతుడినంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఘటనపై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐపీఎల్‌లో వాడుతున్న బెయిల్స్‌ ఫెవికాల్‌ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కింగ్స్‌ పంజాబ్‌-చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ధోని కొట్టిన బంతి వికెట్లకు తాకినప్పటికి బెయిల్స్‌ కిందపడలేదు. దీంతో కేఎల్‌ రాహుల్‌కు లైఫ్‌ లభించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top