భారత మహిళల జోరు 

Indian Women Wins Second ODI Against West Indies Team - Sakshi

రెండో వన్డేలో వెస్టిండీస్‌పై ఘన విజయం

రాణించిన పూనమ్‌ రౌత్, స్పిన్నర్లు

నార్త్‌సౌండ్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన భారత మహిళల జట్టు వెంటనే కోలుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో వన్డేలో భారత్‌ 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పూనమ్‌ రౌత్‌ (128 బంతుల్లో 77; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (67 బంతుల్లో 40; 4 ఫోర్లు), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (52 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం వెస్టిండీస్‌ 47.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. క్యాంప్‌బెల్‌ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్‌ కాగా...ముగ్గురు విభిన్న శైలి గల భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌ తలా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పడగొట్టారు.

భారత్‌ 17 పరుగులకే ఓపెనర్లు ప్రియా పూనియా (5), జెమీమా (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూనమ్‌ రౌత్, మిథాలీ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి 9 ఓవర్లలో భారత్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్‌ కూడా లేకపోగా, మిథాలీ తాను ఎదుర్కొన్న మూడో బంతిని బౌండరీకి తరలించి బోణీ చేసింది. పూనమ్‌ మరీ నెమ్మదిగా ఆడుతూ వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన 70వ బంతికి గానీ ఆమె తొలి ఫోర్‌ కొట్టలేకపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అనంతరం పూనమ్‌తో జత కలిసిన హర్మన్‌ దూకుడుగా ఆడింది. పూనమ్‌ కూడా ధాటిని పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 17.5 ఓవర్లలోనే వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జత చేయడం విశేషం. ఆరు బంతుల వ్యవధిలో పూనమ్, హర్మన్‌ అవుటయ్యారు. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ మొదటినుంచి తడబడుతూనే సాగింది. ఎవరూ భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (20) విఫలం కావడంతో ఆ జట్టు విజయంపై ఆశలు కోల్పోయింది. సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా చివరి వన్డే  ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top