చరిత్రకు చేరువలో...

Indian team in World Archery Championship Final

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత జట్టు

జ్యోతి సురేఖ సభ్యురాలిగా కాంపౌండ్‌ మహిళల బృందం ఘనత

మెక్సికో సిటీ: ఎనిమిదిన్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఏనాడూ భారత్‌కు స్వర్ణ పతకం రాలేదు. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు ఆ లోటు తీరే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, త్రిషా దేబ్‌ (బెంగాల్‌), లిలీ చాను పోనమ్‌ (మణిపూర్‌)లతో కూడిన భారత బృందం ఫైనల్లోకి దూసుకెళ్లింది.

సెమీఫైనల్లో టీమిండియా 232–227తో జర్మనీని ఓడించగా... క్వార్టర్‌ ఫైనల్లో 233–228తో డెన్మార్క్‌పై, తొలి రౌండ్‌లో 232–229తో రష్యాపై గెలిచింది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన భారత్‌ ఈసారి మాత్రం నిలకడగా ఆడుతూ పసిడి పతక పోరుకు అర్హత పొందడం విశేషం. కొలంబియా జట్టుతో  శనివారం జరిగే ఫైనల్లో భారత్‌ గెలిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తుంది. 

ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు నాలుగు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, లిలీ చాను ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోగా... త్రిషా మూడో రౌండ్‌లో పరాజయం పాలైంది.మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురేఖ–అభిషేక్‌ జంట తొలి రౌండ్‌లో 151–154తో సాన్‌ డి లాట్‌–మైక్‌ ష్కాల్సర్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో ఓడింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top