ఐదో పేసరా! మూడో స్పిన్నరా!

Indian Team Will Start The Series With New Zealand Starting This Month - Sakshi

టెస్టు టీమ్‌ ఎంపికలో కీలకం

న్యూజిలాండ్‌ పర్యటనకు నేడు భారత జట్ల ప్రకటన

ఐదు టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు... ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ పర్యటనలో భారత జట్టు తలపడే మ్యాచ్‌ల సంఖ్య ఇది. మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియా ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే సెలక్టర్లకు జట్ల ఎంపిక పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఒకటి, రెండు స్థానాల విషయంలోనే ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ఇప్పటికే ‘షాడో టూర్‌’ రూపంలో పలువురు ప్రధాన ఆటగాళ్లు న్యూజిలాండ్‌లోనే ఉండటంతో కొత్త ఆటగాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు లేదు. ఈ నేపథ్యంలో ఒకేసారి మూడు ఫార్మాట్‌ల కోసం జట్లను నేడు ప్రకటించనున్నారు.  

ముంబై: సొంతగడ్డపై వరుస విజయాల ఉత్సాహంలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు 2020లో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్‌ విమానం ఎక్కనుంది. ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌తో భారత జట్టు సిరీస్‌ ప్రారంభమవుతుంది. మూడు ఫార్మాట్‌లలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం జట్లను ఎంపిక చేసేందుకు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఆదివారం సమావేశమవుతోంది. ఇటీవలి విండీస్‌ సిరీస్‌తోనే ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ పదవీకాలం ముగిసిందని భావించినా... బీసీసీఐలో పరిణామాల నేపథ్యంలో వారికి మరోసారి జట్టును ఎంపిక చేసే అవకాశం లభించింది.  

రాహుల్‌ లేదా శుబ్‌మన్‌ గిల్‌...
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్‌తో భారత్‌ రెండు టెస్టులలో తలపడనుంది. ఇప్పటికే ఆడిన 7 టెస్టుల ద్వారా 360 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్న జట్టు ఈ సిరీస్‌ కూడా గెలిస్తే వచ్చే ఏడాది జరిగే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లే! టెస్టు జట్టులో మూడో ఓపెనర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. లోకేశ్‌ రాహుల్, శుబ్‌మన్‌ గిల్‌ ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. స్వదేశం లో సిరీస్‌లకు జట్టులో ఉన్న గిల్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం అతను ‘ఎ’ జట్టు తరఫున న్యూజిలాండ్‌లోనే ఉన్నాడు. రాహుల్‌ వెస్టిండీస్‌ గడ్డపై చివరి టెస్టు ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని అద్భుత ఫామ్‌ టెస్టుల్లో మళ్లీ అవకాశం కల్పించవచ్చు.

ఓపెనింగ్‌తో పాటు ఎక్కడైనా ఆడగల సామర్థ్యం అతని అదనపు బలం. గాయం కారణంగా ముంబై యువ సంచలనం పృథ్వీ షా పేరు పరిశీలించడం లేదు.  స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడు మూడో స్పిన్నర్‌ను ఎంపిక చేయాలా వద్దా అనే సందిగ్ధత సెలక్టర్లలో ఉంది. గత కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లో పిచ్‌లు నెమ్మది ంచడం కీలక పరిణామం. అలా అయితే కుల్దీప్‌ యాదవ్‌ అందరికంటే ముందుంటాడు. నలుగురు రెగ్యులర్‌ పేసర్లతో పాటు అదనంగా మరో పేసర్‌ను కూడా టెస్టు జట్టులోకి తీసుకోవాలనేది ఆలోచన. అదే జరిగితే బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్‌లతో పాటు నవదీప్‌ సైనీకి అవకాశం దక్కవచ్చు.

కేదార్‌కు చోటుంటుందా!  
వన్డేలు, టి20ల విషయంలోనూ తాజా ఫామ్‌ను తీసుకుంటే పెద్దగా మార్పులు కనిపించడం లేదు. జట్టులో అవకాశం లభించిన ప్రతీ ఒక్కరు వాటిని సమర్థంగా వినియోగించుకుంటేనే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొనే టి20 జట్టును ఎంపిక చేయడం ఖాయం. శ్రీలంకతో సిరీస్‌లో ఒక్క రవీంద్ర జడేజాకు తప్ప అందరికీ మ్యాచ్‌ అవకాశం దక్కింది. అయితే వన్డే, టి20ల్లో అతని ఆల్‌రౌండ్‌ నైపుణ్యం జట్టుకు ఎప్పుడైనా అదనపు బలమే కాబట్టి అతడి స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు. పాండ్యా దూరం కావడంతో శివమ్‌ దూబే తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లే. రోహిత్‌ మళ్లీ వస్తాడు కాబట్టి సంజు సామ్సన్‌నే తప్పించవచ్చు.

భువనేశ్వర్, దీపక్‌ చాహర్‌ గాయాల నుంచి కోలుకోకపోవడంతో పేస్‌ బృందంలో కూడా మార్పులు ఉండవు. అయితే ఇటీవల తరచుగా కేదార్‌ జాదవ్‌ స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలోలాగా ‘ట్రంప్‌ కార్డు’ బౌలింగ్‌ ప్రదర్శనలు అతని నుంచి రావడం లేదు. పైగా బ్యాటింగ్‌లోనూ ఆరో స్థానంలో గుర్తుంచుకోదగ్గ స్కోర్లు కూడా లేవు. అతను ఆడిన గత 15 వన్డేల్లో రెండు సార్లు మాత్రమే కనీసం ఐదు ఓవర్లు వేశాడు. అయితే స్వదేశంలో ఆడినప్పుడు 15 మంది తరహాలో కాకుండా విదేశీ సిరీస్‌కు 16 లేదా 17 మందిని ఎంపిక చేసుకునే సౌలభ్యం బీసీసీఐకి ఉండటంతో ఎవరిపైనా వేటు వేయకుండా కొత్త ఆటగాళ్లను అదనంగా చేర్చినా ఆశ్చర్యం లేదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top