వీధి బాలల ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధం
బ్రెజిల్‌లో జరగనున్న వీధి బాలల ఫుట్‌బాల్ ప్రపంచకప్ (ఎస్‌సీడబ్ల్యూసీ)కు భారత జట్టు సిద్ధమైంది.
జింఖానా : బ్రెజిల్‌లో జరగనున్న వీధి బాలల ఫుట్‌బాల్ ప్రపంచకప్ (ఎస్‌సీడబ్ల్యూసీ)కు భారత జట్టు సిద్ధమైంది. భారతీ ఎయిర్‌టెల్, చెన్నైకి చెందిన కరుణాలయ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల జట్టు వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించాయి.
ఈ జట్టుకు కనాదాస్ సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా కనాదాస్ మాట్లాడుతూ ‘నేను విమానంలో ప్రయాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే బ్రెజిల్‌లో ఫుట్‌బాల్ ఆడే అవకాశం వస్తుందనీ అనుకోలేదు. ఇప్పటికీ ఇదంతా నిజంగా జరుగుతోందంటే నమ్మలేకున్నాను.
ఏది ఏమైనా జట్టు కెప్టెన్‌గా తోటి ఆటగాళ్లను చైతన్యపరిచి ప్రపంచకప్‌ను గెలిచేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని అన్నాడు. తొమ్మిది మంది ఆటగాళ్లు, ముగ్గురు వాలంటీర్లతో కూడిన ఈ జట్టు మరికొన్ని రోజుల్లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు ప్రయాణం కానుంది. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, జింబాబ్వే, భారత్ తదితర దేశాలతో కలిపి మొత్తం 19 దేశాలు ఈ పోటీల్లో పాల్గొనున్నాయి. 2010లో తొలిసారి జరిగిన ఈ పోటీల్లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. 14 నుంచి 16 ఏళ్ల వయస్సు బాలురతో కూడిన 15 జట్లు పది రోజుల పాటు 7-ఎ-సైడ్ ఫుట్‌బాల్ పిచ్‌లపై 30 నిమిషాల పాటు పోటీపడతారు.


