
న్యూఢిల్లీ: క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రొత్సహించాల్సిన భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాధ్యత మరిచే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ) పేరిట నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేసిన ‘సాయ్’ తాజాగా ఎవరి ఆటకు వారే బాధ్యులనే సమ్మతి లేఖను సమర్పించాలని ఆటగాళ్లను కోరడం చర్చనీయాంశమైంది. ఆటగాళ్లకు వెన్నంటే మద్దతివ్వాల్సిన సాయ్... ఇప్పుడీ కొత్త నిబంధన జతచేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లు ఆడేక్రమంలో, శిక్షణ తీసుకునే విషయంతో ‘మాదే బాధ్యత ఇందులో సాయ్‌కి గానీ, సంబంధిత క్రీడా సమాఖ్యకు గానీ సంబంధం లేదు’అనే డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.