భారత మహిళలదే వన్డే సిరీస్‌ | india Won by 8 wickets in the third one day | Sakshi
Sakshi News home page

భారత మహిళలదే వన్డే సిరీస్‌

Apr 13 2018 1:21 AM | Updated on Apr 13 2018 1:21 AM

india Won by 8 wickets in the third one day - Sakshi

నాగ్‌పూర్‌: గతేడాది ఇంగ్లండ్‌ చేతిలో ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాజయానికి భారత మహిళల జట్టు సిరీస్‌ విజయంతో బదులు తీర్చుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2–1తో కైవసం చేసుకుంది. గురువారం ఇక్కడ జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన మిథాలీ బృందం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులకు పరిమితమైంది. వికెట్‌ కీపర్‌ అమి జోన్స్‌ (94; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచింది. జులన్‌ గోస్వామి, దీప్తి శర్మ, రాజేశ్వరి, పూనమ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం మిథాలీ రాజ్‌ (74 నాటౌట్‌; 9 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు దీప్తి శర్మ (54 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతి మంధాన (53 రిటైర్డ్‌ హర్ట్‌; 6 ఫోర్లు) చెలరేగడంతో భారత్‌ 45.2 ఓవర్లలోనే 202 పరుగులు చేసి గెలుపొందింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన దీప్తి శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, స్మృతి మంధానకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద  సిరీస్‌’ అవార్డులు దక్కాయి. ఇంగ్లండ్‌ జట్టుపై ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌ గెలవడం ఇది ఆరోసారి.  

మిథాలీ మరో రికార్డు
ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వన్డే చరిత్రలో అత్యధికంగా 56సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. గతంలో ఈ ఘనత ఇంగ్లండ్‌ ప్లేయర్‌ చార్లోటి ఎడ్వర్ట్స్‌ (55) పేరిట ఉంది. వన్డేల్లో మిథాలీకి ఇది 50వ అర్ధశతకం కావడం మరో విశేషం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement