టీమిండియా ఈసారి అలా బోల్తా పడొద్దు...  | India vs New Zealand: Targeting another first, India eye T20 triumph | Sakshi
Sakshi News home page

ఎవరిదో సిరీస్‌?

Feb 10 2019 1:36 AM | Updated on Feb 10 2019 8:06 AM

India vs New Zealand: Targeting another first, India eye T20 triumph - Sakshi

గత 13 నెలలుగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలతో భూగోళాన్ని చుట్టేస్తోంది టీమిండియా. ఈ ప్రయాణంలో మధురమైన విజయాలను సొంతం చేసుకుంది. పలు ఘనతలను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడిక ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌నకు ముందు విదేశాల్లో ఆఖరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో మూడు నెలలుగా సాగుతున్న ఆస్ట్రేలియా–న్యూజిలాండ్‌ పర్యటనను మరింత గొప్పగా ముగించి... టి20 సిరీస్‌ను ఒడిసిపట్టి సగర్వంగా స్వదేశానికి చేరేందుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. దీనిని రోహిత్‌ బృందం నిజం చేయాలని ఆశిద్దాం.  

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై శుక్రవారం తొలి టి 20 విజయాన్ని అందుకున్న టీమిండియా... అదే ఊపులో మొదటిసారి సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరుగబోయే చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుని ఆ దేశ పర్యటనను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో గత మ్యాచ్‌లో గెలుపును అందించిన జట్టునే బరిలో దించనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో, పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ను చేజార్చుకోకూడదని భావిస్తున్న కివీస్‌... కుగ్లీన్, ఫెర్గూసన్‌ల స్థానంలో నీషమ్, టిక్నెర్‌లను ఆడించనుంది.  

ఈసారి అలా బోల్తా పడొద్దు... 
నాలుగో వన్డేలో పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ధాటికి 92 పరుగులకే ఆలౌటైన హామిల్టన్‌లోనే చివరి టి20 జరుగనుంది. నేటి మ్యాచ్‌లో బౌల్ట్‌ లేనప్పటికీ ఆ అనుభవంతో భారత్‌ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు తొలి టి20లో తడబడినప్పటికీ తప్పులను దిద్దుకున్న మన జట్టు... ఆక్లాండ్‌లో సమష్టిగా రాణించింది. బ్యాటింగ్‌లో రోహిత్, పంత్‌... బౌలింగ్‌లో పేసర్లు భువనేశ్వర్, ఖలీల్, ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా మెరిశారు. కీలకమైన చివరి మ్యాచ్‌లో హార్దిక్, చహల్‌ కూడా ప్రభావం చూపితే కివీస్‌కు ఇబ్బందులు తప్పవు. చహల్‌ స్థానంలో కుల్దీప్‌ను తీసుకోవచ్చని భావిస్తున్నా... కృనాల్‌ రూపంలో ఎడంచేతి వాటం స్పిన్నర్‌ ఉన్నందున ఆ అవకాశం కనిపించట్లేదు. ఓపెనర్లు రోహిత్, ధావన్‌లలో ఒక్కరు నిలదొక్కుకున్నా భారీ స్కోరుకు బాటలు పడతాయి. ధావన్‌ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఐదు మ్యాచ్‌లుగా అతడి నుంచి అర్ధ సెంచరీ నమోదు కాలేదు. భారీ స్కోర్లకు అవకాశం ఉన్న పిచ్‌పై వీరు బలమైన పునాది వేస్తే పంత్, ధోని, కార్తీక్‌ చెలరేగేందుకు వీలుంటుంది.  

ఆ ఇద్దరిని తప్పించి... 
ఆతిథ్య న్యూజిలాండ్‌కు తమ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫామ్‌ లేమి ఆందోళనగా మారింది. మున్ముందు కీలక టోర్నీల దృష్ట్యా విలియమ్సన్‌ గాడినపడటం వారికి అత్యవసరం. తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ సీఫెర్ట్, రెండో దాంట్లో గ్రాండ్‌హోమ్‌ దూకుడుతో ఆ జట్టుకు కీలకంగా నిలిచారు. ఈ మైదానంలో గతేడాది ఇంగ్లండ్‌పై ఓపెనర్‌ కొలిన్‌ మున్రో 18 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. మిడిలార్డర్‌లో టేలర్‌ నిలకడగా ఆడుతున్నాడు. అయితే, అతడి నుంచి జట్టు ఇంకా భారీ స్కోరు ఆశిస్తోంది. ప్రభావం చూపలేకపోతున్న ఆల్‌ రౌండర్‌ కుగ్లీన్, పేసర్‌ ఫెర్గూసన్‌లను తప్పించి... పిచ్‌ పరిస్థితుల రీత్యా నీషమ్‌ వైపు మొగ్గుచూపింది. ధాటిగా ఆడగల అతడు మీడియం పేసర్‌గా బౌలింగ్‌లోనూ పనికొస్తాడు. టిమ్‌ సౌతీతో కలిసి టిక్నెర్‌ పేస్‌ బాధ్యతలు పంచుకుంటాడు.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, పంత్, విజయ్‌ శంకర్, ధోని, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్, చహల్‌. 
న్యూజిలాండ్‌: సీఫెర్ట్, మున్రో, విలియమ్సన్, రాస్‌ టేలర్, మిషెల్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, సోధి, టిక్నెర్‌. 

పిచ్, వాతావరణం 
బౌండరీ సరిహద్దులు కొంచెం పెద్దవైనా... వేగవంతమైన ఔట్‌ ఫీల్డ్‌కు తోడు పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్‌–ఇంగ్లండ్‌ మధ్య ఇక్కడ జరిగిన టి20లో ఇరు జట్లు 386 పరుగులు చేశాయి. ఈసారి కూడా పరుగుల వరద ఖాయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement