భారత్‌-కివీస్‌ నాకౌట్‌ పోరుకు వర్షం ముప్పు!? | India vs New Zealand 1st Semifinal Match Weather Report | Sakshi
Sakshi News home page

భారత్‌-కివీస్‌ నాకౌట్‌ పోరుకు వర్షం ముప్పు!?

Jul 8 2019 9:17 AM | Updated on Jul 8 2019 9:27 AM

India vs New Zealand 1st Semifinal Match Weather Report - Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌ లీగ్‌ దశను విజయవంతంగా ముగించిన టీమిండియా.. మొదటి సెమీఫైన్‌ మ్యాచ్‌లో ‘అండర్‌డాగ్‌’ న్యూజిలాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతోంది. మాంచెస్టర్‌లోని ప్రఖ్యాత ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో మంగళవారం ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్‌-కివీస్‌ మధ్య ఇదే తొలిపోరు కానుంది. లీగ్‌ దశలో గత నెల 13న నాటింగ్‌హామ్‌లో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దైన సంగతి తెలిసిందే.

అయితే, భారత్‌-కివీస్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది. బ్రిటిష్‌ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మాంచెస్టర్‌లో ఆదివారం ఎండ బాగానే కాసింది. అయితే, తీరప్రాంతాల్లోని మేఘాల కారణంగా కొంతసేపు చిరుజల్లులు కురిశాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్‌ నమోదైంది. ఇక, సోమవారం ఆకాశ మేఘావృతమై ఉండి.. చిరుజల్లులు కురిసే అవకాశముందని, ఇక మంగళవారం చిరు జల్లులతో కూడిన వర్షం వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 10 గంటలకు మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశం 50శాతం ఉంటుందని పేర్కొంది. ఆ రోజున ఉదయం మ్యాచ్‌ 10.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ ఉదయం వర్షం పడితే మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది.

అయితే, లీగ్‌ మ్యాచ్‌లకు భిన్నంగా సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు ఐసీసీ ‘రిజర్వు డే’లను కేటాయించింది. మొదటి రోజు మ్యాచ్‌ వర్షార్పణం అయితే ‘రిజర్వు డే’ నాడు ఆడిస్తారు. రిజర్వు డే నాడు కూడా వరుణుడు కరుణించకపోతే.. ఐసీసీ నిబంధనల ప్రకారం.  లీగ్‌ పాయింట్ల పట్టికలో ఎక్కువ పాయింట్లతో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుతుంది. అంటే, కివీస్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే.. భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఇక, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం గండం పొంచి ఉంది. ఇక్కడ వర్షం పడే అవకాశాలు దండిగా ఉన్నాయని.. వరుసగా రెండు రోజులు వర్షం పడితే ఇంగ్లండ్‌ గుండె చెరువై.. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుందని ‘ద సన్‌’ టాబ్లాయిడ్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement