పేస్‌కు దాసోహం

India vs England: india all out 107 - Sakshi

భారత బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం 

తొలి ఇన్నింగ్స్‌లో 107 ఆలౌట్‌

అండర్సన్‌కు 5 వికెట్లు

లార్డ్స్‌ టెస్టు రెండో రోజు   

ఇంగ్లండ్‌ గడ్డపై ఏదో సమయంలో ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని సిరీస్‌కు ముందే అనుకున్న అంచనాలు నిజమయ్యాయి. భారత అభిమానుల ఆందోళనను నిజం చేస్తూ మన ఆటగాళ్లు ‘స్వింగ్‌’కు దాసోహమయ్యారు. వర్షం, చల్లటి వాతావరణం, గాలిలో కాస్త తేమ... ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగిపోయేందుకు, మన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసేందుకు ఈ దినుసులు సరిపోయాయి... గత మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌ వైఫల్యాన్ని కొనసాగించిన టీమిండియా రెండో టెస్టులోనూ కుప్పకూలింది. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో ‘మొదటి’ రోజే ప్రత్యర్థికి తలవంచింది.

0/1, 10/2... కాస్త బ్రేక్‌... 15/3... మళ్లీ విరామం... ఈ దశలో నడిపించాల్సిన మొనగాడు కోహ్లి వల్ల కాలేదు, నమ్ముకున్న రహానే కూడా గండం గట్టెక్కించలేకపోయాడు. అశ్విన్‌ పట్టుదలతో వంద దాటినా అది ఏమాత్రం సరిపోని స్కోరు. వర్షం ఆగకపోయినా బాగుండేదనిపించేలా సాగింది మన ఆట... మూడో రోజు కూడా పిచ్‌ అదే తరహాలో స్పందించి మన పేసర్లూ ప్రత్యర్థిని కుప్పకూల్చుతారా లేక చక్కటి ఎండలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగి మ్యాచ్‌ను తమ వశం చేసుకుంటారా చూడాలి.   

లండన్‌: లార్డ్స్‌ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ బొక్కబోర్లా పడ్డారు. ఇంగ్లండ్‌ పేసర్ల దెబ్బకు తట్టుకోలేక తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌ (38 బంతుల్లో 29; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కోహ్లి (23) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అండర్సన్‌ (5/20) ఐదు వికెట్లతో చెలరేగగా, వోక్స్‌ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 58 పరుగుల వ్యవధిలో భారత్‌ తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది.  

టపటపా... 
టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు ధావన్, ఉమేశ్‌ల స్థానాల్లో పుజారా, కుల్దీప్‌లను తుది జట్టులోకి తీసుకుంది. ఆరంభంలోనే చెలరేగిపోయిన అండర్సన్‌ రెండు వికెట్లతో దెబ్బ తీశాడు. తొలి ఓవర్లోనే విజయ్‌ (0) క్లీన్‌బౌల్డ్‌ కాగా, రాహుల్‌ (8) మళ్లీ విఫలమయ్యాడు. విరామం తర్వాత పుజారా (1) రనౌట్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. సమర్థంగా 25 బంతులు ఎదుర్కొని పాతుకుపోయిన పుజారా... కోహ్లి అత్యుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. అండర్సన్‌ బంతిని ఆడి పుజారా ముందుకు రాగా, కోహ్లి పరుగు కోసం వేగంగా దూసుకొచ్చాడు. అయితే బంతి ఫీల్డర్‌ వద్దకు చేరడంతో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో పుజారా ఔట్‌ కాక తప్పలేదు. ఈ దశలో వర్షం పడింది. తిరిగొచ్చిన అనంతరం కోహ్లి, రహానే (18) కలిసి ఆదుకునే ప్రయత్నం చేసినా అది ఎంతో సేపు సాగలేదు. వోక్స్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ కోహ్లి  ఔటయ్యాక భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది.    

35.2 ఓవర్లలో... 
వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా... రెండో రోజు కూడా చాలా వరకు అదే పరిస్థితి కనిపించింది. ఉదయం ఆట ప్రారంభమైన అర గంట తర్వాత ఒకసారి, ఆ తర్వాత మరో 20 నిమిషాల తర్వాత ఒకసారి మ్యాచ్‌ వర్షంతో ఆగిపోయింది. అనంతరం దాదాపు మూడున్నర గంటల పాటు ఆట నిలిచిపోయింది. రెండో రోజు మొత్తం 35.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, టీమిండియాను కుప్పకూల్చేందుకు ఈ కాసిన్ని ఓవర్లు సరిపోయాయి.  

ఆ 9 బంతులు... 
అండర్సన్‌ను ఎదుర్కొన్నాడు... బ్రాడ్‌ నుంచి సమస్యే రాలేదు... కానీ అనూహ్యంగా వోక్స్‌ నుంచి కోహ్లికి ప్రమాదం ఎదురైంది. బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేసిన వోక్స్‌... కోహ్లిని ఆడుకున్నాడు. వికెట్‌ తీయడానికి ముందు వేసిన ఎనిమిది బంతులు కూడా కోహ్లిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. రెండో బంతి కోహ్లి బ్యాట్‌ను తాకి గల్లీ ఫీల్డర్‌కు ముందు పడింది. నాలుగో బంతి కూడా సరిగ్గా ఇదే తరహాలో వెళ్లింది. ఈసారి నాలుగో స్లిప్‌ ఫీల్డర్‌కు కాస్త ముందుగా పడటంతో విరాట్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన వోక్స్‌ తర్వాతి ఓవర్‌ మూడో బంతి క్యాచ్‌గా మారేదే! కానీ బట్లర్‌ వదిలేశాడు. కానీ తర్వాతి బంతికే భారత కెప్టెన్‌ వెనుదిరిగాడు. లోపలికి దూసుకొచ్చిన చక్కటి బంతిని ఆడలేక తడబడ్డాడు. ఈసారి బంతి రెండో స్లిప్‌లోకే వెళ్లగా బట్లర్‌ తప్పు చేయలేదు. ఆరంభంలో చెలరేగిన అండర్సన్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యతను తీసుకున్న కోహ్లి దానిని చేసి చూపించాడు. ఇంగ్లండ్‌ ప్రధాన పేసర్‌ నుంచి 30 బంతులు ఎదుర్కొన్నా ఎక్కడా అవకాశం ఇవ్వని భారత కెప్టెన్‌ను వోక్స్‌ ఔట్‌ చేశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top