'ధర్మశాల' దక్కేదెవరికో?

'ధర్మశాల' దక్కేదెవరికో?


నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక టెస్టు

ఒత్తిడిలో ఆతిథ్య జట్టు

కోహ్లి ఆడేది అనుమానమే

ఇషాంత్‌ స్థానంలో షమీ!
నిజానికి సిరీస్‌ ఆరంభానికి ముందు టీమిండియాకు ఇలాంటి ‘కష్టం’ ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. 4–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. అయితే అంచనాలు తారుమారై ఇప్పుడు భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని ఆస్ట్రేలియా నుంచి లాగేసుకునేందుకు ధర్మశాలలో నేటి నుంచి జరిగే చివరి టెస్టును నెగ్గడం తప్పనిసరి.  దీనికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భుజం నొప్పి నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతను ఆడేది అనుమానంగా మారింది. ఇదే జరిగితే బరిలోకి దిగకముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే..  ఏదేమైనా ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ నెగ్గి సొంతగడ్డపై సాగిన సుదీర్ఘ టెస్టు సీజన్‌ను విజయవంతంగా ముగించాలని భారత్‌ కోరుకుంటోంది.ఇక మూడో టెస్టులో భారత్‌ విజయావకాశాలను సమర్థంగా అడ్డుకున్న ఆస్ట్రేలియా జట్టు ఫుల్‌ జోష్‌లో ఉంది. నైతికంగా తామే గెలిచామనే

భావనతో చివరి టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ప్యాట్‌ కమిన్స్, హేజల్‌వుడ్‌ దూకుడుకు ఇక్కడి బౌన్సీ పిచ్‌ సహకారం అందిస్తే భారత్‌కు తిప్పలు తప్పవు. వార్నర్‌ మినహా అంతా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే్చ అంశం. దీంతో 2004 అనంతరం భారత గడ్డపై ఓ టెస్టు సిరీస్‌ను దక్కించుకోవడంతో పాటు వరుసగా మరోసారి ఈ ట్రోఫీని గెల్చుకోవాలని ఆసీస్‌ ఉవ్విళ్లూరుతోంది.  
ధర్మశాల: ఆటకన్నా వివాదాలతో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రస్తుత బోర్డర్‌–గావస్కర్‌ టెస్టు సిరీస్‌ చివరి అంకానికి చేరుకుంది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటి (శనివారం) నుంచి బరిలోకి దిగబోతున్నాయి. ఈ హోరాహోరీ పోరుకు ధర్మశాలలోని హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం స్టేడియం ‘తొలిసారి’గా వేదిక కానుంది. ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు స్వదేశంలో అద్భుత ఆటతీరుతో విజయయాత్ర కొనసాగించింది. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించి అజేయంగా నిలిచింది. తాజాగా ఆస్ట్రేలియా జట్టును కూడా ఇదే కోవలోకి చేర్చాలనే కసితో విరాట్‌ సేన ఉంది. అయితే 1–1తో సిరీస్‌ సమంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆడేది అనుమానంగా మారింది.భుజం నొప్పితో బాధపడుతున్న అతను మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉన్నాడా? అనేది సంశయాత్మకంగా ఉంది. ధర్మశాలలో గురువారం జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌కు అతను వచ్చినా బ్యాటింగ్‌ చేయలేదు. ఇప్పటికే అతని స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను బ్యాకప్‌గా తీసుకున్నారు. మరోవైపు ఆసీస్‌ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సిరీస్‌ గెల్చుకోవాలనే ఆలోచనలో ఉంది. తొలి టెస్టులో ఘనవిజయం తర్వాత రెండో టెస్టులో ఆజట్టు చతికిలపడినా రాంచీ మ్యాచ్‌లో పుంజుకుంది. చివరి రోజు అద్భుత బ్యాటింగ్‌తో భారత విజయాన్ని అడ్డుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే కీలక పోరు అభిమానులను ఆకట్టుకోనుంది.కోహ్లి పరిస్థితేమిటి?

కీలకమైన చివరి టెస్టులో కోహ్లి ఆడతాడా.. లేదా? అనే విషయంలో ఇప్పటిదాకా స్పష్టత కనిపించడం లేదు. తాను మాత్రం పూర్తి ఫిట్‌నెస్‌ లేకుండా బరిలోకి దిగనని తేల్చాడు. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఈ విషయం తేలే అవకాశం ఉంది. శుక్రవారం కొద్దిసేపు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసినా ఫిజియో నిర్ణయం మేరకు నడుచుకుంటానని తేల్చాడు. అయితే ప్రత్యర్థికి మానసికంగా ఎలాంటి పైచేయి ఇవ్వకూడదనే ఆలోచనలో టీమిండియా మేనేజిమెంట్‌ ఉంది. అందుకే అతను మీడియా సమావేశానికి కూడా హాజరయ్యాడు. ఒకవేళ కోహ్లి ఆడలేకపోతే రహానే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. బ్యాటింగ్‌లో మురళీ విజయ్‌ ఓపెనర్‌గా విజయవంతమవుతున్నాడు. అయితే తను శుక్రవారం ప్రాక్టీస్‌కు హాజరుకాకపోగా, అభినవ్‌ ముకుంద్‌ ఎక్కువసేపు శిక్షణ సాగించాడు.అలాగే రహానే, కరుణ్‌ నాయర్‌ కూడా కీలక సమయంలో బ్యాట్‌ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. చతేశ్వర్‌ పుజారా ఈ సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాంచీలో డబుల్‌ సెంచరీ అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అటు కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో చెలరేగడం అనుకూలాంశం. బ్యాకప్‌గా వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆసీస్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించాడు. తుది జట్టులో బరిలోకి దిగితే తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇదిలావుండగా జట్టు ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావిస్తే కరుణ్‌ నాయర్‌ తప్పుకోవాల్సి వస్తుంది. ఉమేశ్‌ పేస్‌ బాధ్యతలు మోస్తున్నాడు. ఇషాంత్‌ ఇప్పటిదాకా మూడు వికెట్లు మాత్రమే తీయగా తన స్థానంలో జట్టులో చేరిన మొహమ్మద్‌ షమీ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా జట్టుకు ఉపయోగపడుతున్నారు.జోష్‌లో ఆస్ట్రేలియా...

ఆసీస్‌ జట్టులో ఆందోళన ఏదైనా ఉందంటే అది ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వైఫల్యమే. మిగతా అన్ని అంశాల్లోనూ ఈ జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. కెప్టెన్‌ స్మిత్‌ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించి ఊపు మీదున్నాడు. మ్యాట్‌ రెన్‌షా చక్కటి ఆటతీరుతో ప్రశంసలందుకుంటున్నాడు. హ్యాండ్స్‌కోంబ్‌ మూడో టెస్టులో జట్టును ఆదుకున్న తీరు అపూర్వం. ఇక వార్నర్‌ ఒక్కడు ఫామ్‌లోకి వస్తే కీలక టెస్టులో భారత్‌కు ఇబ్బంది తప్పదు. మ్యాక్స్‌వెల్‌ తాను నిదానంగా కూడా ఆడగలనని సెంచరీతో నిరూపించుకున్నాడు. అయితే పిచ్‌ను బట్టి బౌలింగ్‌లో స్పిన్నర్‌ ఒకీఫ్‌ను తప్పించి అతడి స్థానంలో పేసర్‌ జాక్సన్‌ బర్డ్‌ను తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బౌన్సీ వికెట్‌ సిద్ధమైతే ప్యాట్‌ కమిన్స్, హేజల్‌వుడ్, బర్డ్‌ భారత బ్యాటింగ్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే రాంచీలో ఆడిన జట్టునే కొనసాగించేందుకు ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది.‘తొలి’ ఓటమిని చెరిపేస్తారా..?

అసలే సిరీస్‌ను నిర్ణయించే కీలక టెస్టు మ్యాచ్‌ ఆడబోతున్న భారత్‌కు ఇక్కడి ధర్మశాల స్టేడియంలో తమ రికార్డు భయపెడుతోంది. ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన తొలి అంతర్జాతీయ వన్డే, టి20ల్లోనూ భారత జట్టుకు ఓటమి ఎదురుకావడం ఇందుకు కారణం. 2013 ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో... 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20లో భారత్‌ పరాజయం పాలైంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ జరగబోయే అరంగేట్రం టెస్టులో భారత్‌ మెరుగ్గా ఆడి గత చరిత్రను తిరగరాస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.పిచ్, వాతావరణం

గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పిచ్‌ ఎక్కువగా పేసర్లకు అనుకూలించింది. అయితే గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో స్పిన్నర్లు విశేషంగా రాణించారు. ప్రస్తుతానికైతే పిచ్‌పై పచ్చిక ఎక్కువగానే కనిపిస్తోంది. మ్యాచ్‌ జరిగే రోజు ఉదయం కట్‌ చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్పిన్నర్లు కూడా కీలకంగా మారతారు. రెండు రోజుల అనంతరం వర్ష సూచనలున్నాయి.జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌)/అయ్యర్, విజయ్‌/అభినవ్‌ ముకుంద్, రాహుల్, రహానే, పుజారా, కరుణ్‌ నాయర్, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్‌/షమీ, ఉమేశ్‌ యాదవ్‌.

ఆస్ట్రేలియా: స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, రెన్‌షా, షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, వేడ్, ఒకీఫ్, కమిన్స్, లయన్, హేజల్‌వుడ్‌.ఉదయం గం. 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top