ఓడితే... సిరీస్‌ గెలవలేం | india - srilanka second ODI today | Sakshi
Sakshi News home page

ఓడితే... సిరీస్‌ గెలవలేం

Dec 13 2017 12:47 AM | Updated on Nov 9 2018 6:43 PM

india - srilanka second ODI today  - Sakshi

ఒకటే కదా ఓడాం అంటే కుదరదిపుడు! ఈ రెండో మ్యాచ్‌ నెగ్గితేనే సిరీస్‌లో నిలవగలం, ఆ తర్వాత గెలవగలం. ఇందులోనూ ఓడితే స్వదేశంలో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను సమర్పించుకుంటాం. కాబట్టి చెత్త ఆటతీరును, కొత్త ప్రయోగాలను పక్కన బెట్టాలి. ఒత్తిడిని అధిగమించి ఫలితాన్ని రాబట్టాలి. మూడు వన్డేల సిరీస్‌లో ఇక్కడ 1–1తో నిలువరిస్తేనే వైజాగ్‌లో తేల్చుకోవచ్చు. రోహిత్‌ సేన తస్మాత్‌ జాగ్రత్త!  

మొహాలి: టీమిండియా ఇప్పుడు రెండు లక్ష్యాలతో బరిలోకి దిగాలి. మైదానంలో దిగడానికి ముందే ఒత్తిడిని జయించాలి. ఆ తర్వాతే ప్రత్యర్థి పని పట్టాలి. ఈ రెండు పూర్తయితేనే సిరీస్‌ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం రోహిత్‌ సేన చేయాల్సింది ఇదే. బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరు కలిసికట్టుగా కదంతొక్కాలి. ఈ వన్డేలో గెలిస్తేనే... సిరీస్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటాం. లేదంటే శ్రీలంక ప్రతీకారానికి మనమే మరో బాట వేస్తాం. సిరీస్‌లో శుభారంభం చేసిన శ్రీలంక... రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బుధవారం జరిగే రెండో వన్డేకు సై అంటోంది. ఈ డే నైట్‌ మ్యాచ్‌ కూడా ఉదయం 11.30 గంటలకే ఆరంభమవుతుంది.

చేజారితే... చేతికందదు!
చావోరేవో తేల్చుకునే మ్యాచ్‌లో భారత్‌ కచ్చితంగా గెలవాలి. తొలి వన్డేలాగే ఒక వేళ టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగితే భారత బ్యాట్స్‌మెన్‌కు కఠిన పరీక్షే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో  కెప్టెన్‌ కమ్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ భారాన్ని జాగ్రత్తగా మోయాలి. మిడిలార్డర్‌ యువకులతో నిండి ఉంది. నిప్పులు చేరిగే లక్మల్‌ బౌలింగ్‌కు యువ బ్యాట్స్‌మెన్‌ మళ్లీ తలొగ్గితే పరుగుల రాక గగనమవుతుంది. కాబట్టి టాపార్డర్‌లో ధావన్‌ కూడా ఓపిగ్గా ఆడాల్సి ఉంటుంది. ఒక మోస్తరు స్కోరు వస్తే మిగతా కథను నడిపించేందుకు ధనాధన్‌ ధోని ఉండనే ఉన్నాడు. తొలి వన్డేలో పక్కన బెట్టిన రహానేకు చాన్స్‌ దక్కొచ్చు. అందివచ్చిన అవకాశాల్ని దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండేలు సద్వినియోగం చేసుకోవాలి. బౌలింగ్‌లో బుమ్రా, భువనేశ్వర్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, చహల్‌  నిలకడ చూపెడితే గెలుపు కష్టం కాదు. ఒకవేళ అలసత్వంతో ఆడి ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంటే ఇక సిరీస్‌ చేతికందదు.

సిరీస్‌పైనే లంక కన్ను
మొదట తొలి టెస్టులో, అనంతరం ఇపుడు తొలి వన్డేలో పర్యాటక జట్టు శ్రీలంక తమ పేస్‌ పదునుతోనే ఆతిథ్య జట్టును దెబ్బ కొట్టింది. తొలి టెస్టులో భారత్‌కు చావుతప్పి కన్నులొట్టబోయినా... తొలి వన్డేలో మాత్రం మ్యాచ్, ‘నంబర్‌వన్‌’ ప్రతిష్ట రెండు పోయాయి. దీంతో తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో ఉన్న సింహళ జట్టు ఇపుడు ఒక్క మ్యాచ్‌పైనే కాదు... ఏకంగా సిరీస్‌పైనే దృష్టిపెట్టింది. లంక పేస్‌కు తురుపుముక్క అయిన లక్మల్‌ నుంచి మరో చక్కని ప్రదర్శనను ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో తరంగ ఫామ్‌లోకి వచ్చాడు. మూడో టెస్టును గట్టెక్కించిన ధనంజయ డిసిల్వా కూడా అందుబాటులోకి రావడంతో టాపార్డర్‌ పటిష్టమైంది. మిడిలార్డర్‌లో మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నేలతో జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ సమతూకంగా ఉంది.

టాసే విన్నర్‌
శీతాకాలంలో భారత్‌లో రాత్రి మంచు ప్రభావం ఎక్కువ. ఉత్తర భారతంలోనైతే మరింత ఎక్కువ. దీంతో మ్యాచ్‌లకు టాస్‌ కీలకమవుతుంది. టాస్‌ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకుంటుంది. గతేడాది ఇక్కడ న్యూజిలాండ్‌ 286 పరుగుల భారీ స్కోరు చేసినా కోహ్లి సేన సునాయాసంగా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో పడిన మొత్తం 13 వికెట్లలో సీమర్లే 8 వికెట్లు తీశారు. కాబట్టి టాస్‌ గెలిస్తే... సగం మ్యాచ్‌ గెలిచినట్లే!  

పిచ్, వాతావరణం
ఒకపుడు మొహాలి పిచ్‌ సీమర్లకు అచ్చొచ్చినా... రానురాను ఆ పరిస్థితి మారింది. అయితే ఇపుడు శీతాకాలం కాబట్టి వికెట్‌ నుంచి పేసర్లు లబ్ధి పొందొచ్చు. చినుకులు పడే అవకాశమున్నా... మ్యాచ్‌ను అది ప్రభావితం చేయదు.  

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, శ్రేయస్‌ అయ్యర్‌/రహానే, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, అక్షర్‌/కుల్దీప్, బుమ్రా, చహల్‌.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), గుణతిలక, తరంగా, తిరిమన్నే/కుశాల్‌/సమరవిక్రమ, ధనంజయ డిసిల్వా, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, ప్రదీప్‌.  

ఉదయం 11.30 గంటల నుంచి ‘స్టార్‌ స్పోర్ట్స్‌–1’లో ప్రత్యక్ష ప్రసారం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement