మున్రో డేంజరెస్‌ బ్యాట్స్‌మన్‌ కానీ..

 India not missing fifth bowler in T20Is, says Bhuvneshwar Kumar - Sakshi

సాక్షి, తిరువనంతపురం: రెండో టీ20లో సెంచరీతో కదం తొక్కిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ కొలిన్ మున్రో డేంజరెస్‌ బ్యాట్స్‌మనే కానీ మిగతా కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అభిప్రాయపడ్డాడు. కివీస్‌ ప్లేయర్లంతా రాణించడంతోనే నిర్ణయాత్మక మ్యాచ్‌లు ఆడే పరిస్థితి ఏర్పడిందన్నాడు. టీ20 ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు తిరవనంతపురం వచ్చిన భువీ మీడియాతో మాట్లాడాడు. టీ20ల్లో నలుగురు ప్రధాన బౌలర్లతోనే కోహ్లి సేన బరిలోకి దిగుతుందన్న వాదనను భువనేశ్వర్‌ కొట్టిపారేశారు. ఐదో బౌలర్‌ను టీమిండియా ఉపయోగిస్తుందని, ఆ స్థానాన్ని పాండ్యా భర్తీ చేస్తున్నాడని, కొన్ని సార్లు పార్ట్‌ టైమ్‌ బౌలర్లు ఆ బాధ్యతను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. 

ఇక బుమ్రా బౌలింగ్‌ శైలిపై స్పందిస్తూ తన బౌలింగ్‌ యాక్షనే బలంగా మారిందన్నాడు. అతని యాక్షన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతదని తెలిపాడు. బుమ్రా రోజు రోజుకు మెరుగవుతున్నాడని, ముఖ్యంగా యార్కర్లతో డెత్‌ ఓవర్లలో రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. మ్యాచ్‌కు ముందు ఇద్దరం ప్రణాళికలపై చర్చించుకుంటామని భువీ తెలిపాడు. మ్యాచ్‌ ఓడితే బౌలర్లు నిందించడం సరికాదని, పర్యాటక జట్టు బాగా ఆడిందనే విషయాన్ని గుర్తించాలని సూచించాడు.

గత కొద్ది రోజులుగా మంచి క్రికెట్‌ ఆడుతున్నామని, ఆసీస్‌, విండీస్‌ పర్యటనల నుంచి వరుస విజయాలు నమోదు చేశామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌లతో చాల చిన్న సిరీస్‌ అని ఒకటి ఓడితే మరోటి గెలిచి సిరీస్‌ సమం చేసి నిర్ణయాత్మక మ్యాచ్‌ ఆడవచ్చన్నాడు. ఇప్పటికే కివీస్‌పై భారత్‌ వన్డే సిరీస్‌(2-1)తో గెలుచుకోగా.. టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్‌ మంగళవారం జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top