భారత్‌కు చేజారిన విజయం | India, missing victory | Sakshi
Sakshi News home page

భారత్‌కు చేజారిన విజయం

Jun 11 2016 1:01 AM | Updated on Sep 4 2017 2:10 AM

భారత్‌కు చేజారిన విజయం

భారత్‌కు చేజారిన విజయం

పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన భారత జట్టు తొలి......

జర్మనీతో 3-3తో మ్యాచ్ ‘డ్రా’
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ


లండన్:  పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా 3-3తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున రఘునాథ్ (7వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (26వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జర్మనీ జట్టుకు టామ్ గ్రామ్‌బుష్ (26వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్, జొనాస్ గోమోల్ (57వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు.


ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ సద్వినియోగం చేసుకోవడంతో భారత్ ఖాతా తెరిచింది. 26వ నిమిషంలో జర్మనీ స్కోరు సమం చేసినా... ఆ వెంటనే భారత్ మరో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్ ఆరంభంలో హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్‌తో భారత్‌కు మూడో గోల్‌ను అందించాడు.

ఈ దశలో జర్మనీ దూకుడును పెంచి భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి రెండో గోల్‌ను సాధించింది. ఆ తర్వాత కాసేపు జర్మనీ జోరును భారత్ అడ్డుకున్నా... చివర్లో తడబడింది. 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకొని స్కోరును సమం చేసింది. చివరి 3 నిమిషాల్లో భారత్ మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement