ఆధిపత్యం మనది గెలుపు అర్జెంటీనాది | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం మనది గెలుపు అర్జెంటీనాది

Published Sat, Dec 9 2017 1:03 AM

India lost in the semi-finals of the Hockey World League - Sakshi

భువనేశ్వర్‌: ముఖాముఖి రికార్డులో స్పష్టమైన ఆధిక్యం ఉన్నా... మైదానంలో ఆటపరంగా ఆధిపత్యం చలాయించినా... తుది ఫలితం మాత్రం భారత్‌కు నిరాశ కలిగించింది. హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భాగంగా ప్రపంచ నంబర్‌వన్, రియో ఒలింపిక్స్‌ విజేత అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 0–1 తేడాతో ఓడిపోయింది. భారీ వర్షంలోనే జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌పై ఐదు సార్లు షాట్‌ కొట్టినా... ‘డి’ ఏరియాలో 11 సార్లు చొచ్చుకెళ్లినా... చివరి క్వార్టర్‌లో ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా గోల్‌ మాత్రం చేయలేకపోయారు. మరోవైపు అర్జెంటీనాకు ఆట 17వ నిమిషంలో లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను గొంజాలా పిలాట్‌ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత భారత్‌ పలుమార్లు అర్జెంటీనా గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినా బంతిని మాత్రం లక్ష్యానికి చేర్చలేకపోయింది. టర్ఫ్‌పై ఎక్కువగా నీళ్లు ఉండటంతో భారత ఆటగాళ్లు తమ సహజశైలిలో వేగంగా కదల్లేకపోయారు.

ఫీల్డ్‌ గోల్స్‌ చేయడం కష్టమైన తరుణంలో పెనాల్టీ కార్నర్‌లపైనే రెండు జట్లు ఆధారపడ్డాయి. అర్జెంటీనా తమకు దక్కిన ఏకైక అవకాశాన్ని అనుకూలంగా మల్చుకోగా... భారత్‌ తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది. చివరి ఐదు నిమిషాల్లో భారత్‌ గోల్‌కీపర్‌ లేకుండానే ఆడింది. గోల్‌ కీపర్‌ ఆకాశ్‌ చిక్టేను వెనక్కి రప్పించి అతని స్థానంలో అదనంగా మరో ప్లేయర్‌ను ఆడించింది. అయితే ఈ వ్యూహం కూడా కలసిరాలేదు. జర్మనీ, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో ఆదివారం భారత్‌ కాంస్య పతకం కోసం ఆడుతుంది. ఈ మెగా ఈవెంట్‌ టోర్నీలో భారత్‌ సెమీస్‌లో ఓడిపోవడం వరుసగా రెండోసారి. 2015లో రాయ్‌పూర్‌లో జరిగిన టోర్నమెంట్‌లోనూ భారత్‌ సెమీఫైనల్లో ఓడి చివరకు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

Advertisement
Advertisement