రెండో వన్డేలో భారత్ ఓటమి | India lost second one day | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో భారత్ ఓటమి

Jul 2 2015 12:23 AM | Updated on Oct 17 2018 4:43 PM

రెండో వన్డేలో భారత్ ఓటమి - Sakshi

రెండో వన్డేలో భారత్ ఓటమి

తొలి వన్డేల్లో సమష్టిగా రాణించి విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

తిరుష్ కామిని శ్రమ వృథా
 బెంగళూరు: తొలి వన్డేల్లో సమష్టిగా రాణించి విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది.
 
 తిరుష్ కామిని (96 బంతుల్లో 61; 11 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (50 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించారు. ఏక్తా బిస్త్ (18 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. సృ్మతి మందన (12)తో కలిసి కామిని తొలి వికెట్‌కు 33; కెప్టెన్ మిథాలీ రాజ్(13)తో కలిసి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించింది. తర్వాత కివీస్ 44.2 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసి నెగ్గింది.
 
 డివైన్ (33), పెర్కిన్స్ (30), సట్టెర్త్‌వైట్ (23), అన్నా పీటర్సన్ (23 నాటౌట్), ప్రీస్ట్ (21) రాణించారు. తక్కువ స్కోరును కాపాడుకునే క్రమంలో భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసినా... డివైన్, పెర్కిన్స్‌లు ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. తర్వాత కాస్పారెక్, పీటర్సన్ ఎనిమిదో వికెట్‌కు 32 పరుగులు జోడించడంతో కివీస్ విజయం ఖాయమైంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, రాజేశ్వరి రెండేసి వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement