
మెక్సికో సిటీ: తొలి, చివరి రౌండ్‌లో తడబాటు కారణంగా... ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకంతో సంతృప్తి పడింది. శనివారం జరిగిన టీమ్ విభాగం ఫైనల్లో వెన్నం జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, లిలీ చాను పోనమ్‌లతో కూడిన భారత జట్టు 228–234 (55–58, 58–59, 60–59, 55–58) పాయింట్ల తేడాతో కొలంబియా జట్టు చేతిలో ఓడిపోయింది.
ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కిది ఐదో రజత పతకం. గతంలో భారత పురుషుల జట్టు రికర్వ్ ఈవెంట్‌లో (2005లో మాడ్రిడ్, స్పెయిన్), భారత మహిళల జట్టు రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో (2011లో ట్యూరిన్, ఇటలీ; 2015లో కొపెన్‌హగెన్, డెన్మార్క్) రజత పతకాలు సాధించింది. 2015లోనే పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజత్ చౌహాన్ రజత పతకాన్ని గెలుపొందాడు.