కిర్రాక్‌ పుట్టించాడే!

India Beat West Indies By 6 Wickets In Hyderabad - Sakshi

కోహ్లి కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌

50 బంతుల్లో 94 నాటౌట్‌

6 ఫోర్లు, 6 సిక్స్‌లు

208 పరుగుల లక్ష్యం అవలీలగా ఛేదన

తొలి టి20లో భారత్‌ జయభేరి

రాణించిన రాహుల్‌

హెట్‌మైర్‌ మెరుపులు వృథా

రేపే రెండో టి20  

విరాట్‌ కోహ్లి తన అది్వతీయ బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ ప్రేక్షకుల మనసుల్లో కిర్రాక్‌ పుట్టించాడు. ఛేదనలో మళ్లీ మొనగాడిగా నిలిచాడు. బౌలర్లను కనిపెట్టుకునే ఉప్పల్‌ పిచ్‌ తొలి అంతర్జాతీయ టి20లో మాత్రం పరుగుల ఉప్పెనలా మారింది. ముందు రాహుల్‌ మెరుపులకు తోడుగా నిలిచిన కోహ్లి ఆ తర్వాత అన్నీ తానై గెలిపించాడు.  

సాక్షి, హైదరాబాద్‌: కోహ్లి అలసటెరుగని పోరాటంతో భారత్‌ను గెలిపించాడు. అతను కడదాకా నిలిచాడు. కసిదీరా బంతుల్ని కొట్టాడు. దీంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లే కాదు బంతి కూడా దెబ్బమీద దెబ్బలతో విసిగిపోయింది. విరాట్‌ ఆఖరిదాకా నిలువడంతో కొండంత లక్ష్యం కూడా చిన్నబోయింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) విశ్వరూపంతో కరీబియన్ల భరతం పట్టాడు.

ముందుగా వెస్టిండీస్‌ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు చేసింది. హెట్‌మైర్‌ (41 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), లూయిస్‌ (17 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగారు. భారత బౌలర్లలో చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ (40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. ఈ విజయంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో రెండో టి20 జరుగుతుంది.

విరుచుకుపడిన లూయిస్‌...
టాస్‌ నెగ్గిన  కోహ్లి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో విండీస్‌ పరుగులు మొదలుపెట్టగా... ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్, సిక్సర్‌తో ఎదురుదాడికి దిగాడు. అయితే దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌కు దిగీదిగగానే విండీస్‌ ఓపెనర్‌ సిమన్స్‌ (2) వికెట్‌ను పడేశాడు. క్రీజ్‌లోకి బ్రాండన్‌ కింగ్‌ రాగా... విండీస్‌ జోరు అంతకంతకూ పెరిగింది. చాహర్‌ మరుసటి ఓవర్లో లూయిస్‌ 6, 4 కొడితే, కింగ్‌ కూడా ఓ సిక్సర్‌ బాదాడు. ధాటిగా ఆడుతున్న లూయిస్‌ను సుందర్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు.  

హెట్‌మైర్‌ అర్ధసెంచరీ

తర్వాత క్రీజ్‌లోకి దిగిన ప్రతీ ఒక్కరూ బాదేయడంతో విండీస్‌ స్కోరు ఏ దశలోనూ 10 పరుగుల సగటుకు పడిపోలేదు. హెట్‌మైర్, కింగ్‌ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చకచకా పరుగులు సాధించారు. పదో ఓవర్‌ పూర్తికాకముందే జట్టు స్కోరు వందకు చేరింది. దూకుడుగా ఆడుతున్న కింగ్‌ జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. తర్వాత హెట్‌మైర్‌కు కెపె్టన్‌ పొలార్డ్‌ జతయ్యాడు. ఇద్దరు మెరుపులు మెరిపించడంతో స్కోరు వేగం మరింత పుంజుకుంది. హెట్‌మైర్‌ 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇద్దరిని ఒకే ఓవర్లో స్పిన్నర్‌ చహల్‌ ఔట్‌ చేయడంతో... హోల్డర్‌ (24 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రామ్‌దిన్‌ (11 నాటౌట్‌) జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు.

రాహుల్‌ జిగేల్‌

లక్ష్యం కష్టసాధ్యమే అయినా... ఛేదనకు తగ్గట్లుగానే బ్యాట్‌కు పనిచెప్పారు భారత బ్యాట్స్‌మెన్‌. రాహుల్‌ వేగంగా ఆడాడు. రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. రోహిత్‌ శర్మ (8) విఫలమైనప్పటికీ తర్వాత కెపె్టన్‌ కోహ్లి  జతకావడంతో భారత్‌ లక్ష్యంవైపు పరుగు పెట్టింది. ఆరో ఓవర్లో జట్టు 50 పరుగులు చేసింది. ఇద్దరూ వెస్టిండీస్‌ బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ పటిష్టమైన భాగస్వామ్యానికి బాట వేశారు. 11.4 ఓవర్లలో భారత్‌ 100 పరుగులను చేరుకుంది. కాసేపటికే రాహుల్‌ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్ధసెంచరీ సాధించాడు. రెండో వికెట్‌కు కోహ్లి, రాహుల్‌ 100 పరుగులు జోడించారు. అనంతరం భారీషాట్‌కు యతి్నంచి రాహుల్‌ ని్రష్కమించాడు.

విరాట్‌... ధనాధన్‌...
పెద్ద లక్ష్యం ముందుండగా... హిట్‌మ్యాన్‌ (రోహిత్‌) చేతులెత్తేయగా... విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌కు మూలస్తంభమయ్యాడు. 200 పైచిలుకు లక్ష్యం కావడంతో తన వికెట్‌ విలువ ఏంటో తెలుసుకొని ఆడాడు. రాహుల్‌ చెలరేగేందుకు ఊతమిచ్చిన భారత కెపె్టన్‌ జట్టు గెలిచేదాకా క్రీజ్‌ను అంటిపెట్టుకున్నాడు. రాహుల్‌ జోరులో వెనుకబడినట్లు కనిపించిన కోహ్లి... అతను ఔటయ్యాక మాత్రం అంతా తానై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 10వ ఓవర్‌ ముగిసే సమయానికి రాహుల్‌ (46) చేసిన పరుగుల్లో కోహ్లి (20) సగమైనా చేయలేదు. కానీ మూడు ఓవర్ల వ్యవధిలోనే అతన్ని సమీపించాడు. హోల్డర్‌ వేసిన 11, 15వ ఓవర్లలో వరుసగా 6, 4 బాదిన కోహ్లి మ్యాచ్‌ సాగేకొద్దీ కసిదీరా బ్యాట్‌ ఝళిపించాడు. విలియమ్స్‌నూ అదే తరహాలో (4, 6) శిక్షించాడు. రిషభ్‌ పంత్‌ (18), శ్రేయస్‌ అయ్యర్‌ (4)పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయినా... విలియమ్స్‌ 19వ ఓవర్లో మరో 2 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. 2017లో కింగ్‌స్టన్‌లో జరిగిన టి20 మ్యాచ్‌ సందర్భంగా కోహ్లిని ఔట్‌ చేసినపుడు విలియమ్స్‌ చేసుకున్న ‘నోట్‌బుక్‌ స్టయిల్‌’ సంబరాన్ని... ఇప్పుడు విలియమ్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌లు బాదినపుడు కోహ్లి కూడా అదే శైలీని అనుకరించిమరీ సంబరం చేసుకున్నాడు.

 స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (సి) రోహిత్‌ (బి) చాహర్‌ 2; లూయిస్‌ (ఎల్బీ) (బి) సుందర్‌ 40; కింగ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) జడేజా 31; హెట్‌మైర్‌ (సి) రోహిత్‌ (బి) చహల్‌ 56; పొలార్డ్‌ (బి) చహల్‌ 37; హోల్డర్‌ (నాటౌట్‌) 24; రామ్‌దిన్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5›వికెట్లకు) 207.
వికెట్ల పతనం: 1–13, 2–64, 3–101, 4–172, 5–173. బౌలింగ్‌: సుందర్‌ 3–0–34–1, చాహర్‌ 4–0–56–1, భువనేశ్వర్‌ 4–0– 36–0, జడేజా 4–0– 30– 1, చహల్‌ 4–0–36–2, దూబే 1–0– 13–0.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) హెట్‌మైర్‌ (బి) పియర్‌ 8; రాహుల్‌ (సి) పొలార్డ్‌ (బి) పియర్‌ 62; కోహ్లి (నాటౌట్‌) 94; పంత్‌ (సి) హోల్డర్‌ (బి) కాట్రెల్‌ 18; శ్రేయస్‌ (సి అండ్‌ బి) పొలార్డ్‌ 4; శివమ్‌ దూబే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 209.
వికెట్ల పతనం: 1–30, 2–130, 3–178, 4–193. బౌలింగ్‌: కాట్రెల్‌ 4–0–24–1, హోల్డర్‌ 4–0–46–0, పియర్‌ 4–0–44– 2, వాల్‌‡్ష 2–0–19–0, విలియమ్స్‌ 3.4–0–60–0, పొలార్డ్‌ 1–0–10–1.  

►1 అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కిదే అత్యధిక ఛేదన. గతంలో శ్రీలంకపై (207–మొహాలీలో, 2009); ఆస్ట్రేలియాపై (202–రాజ్‌కోట్‌లో, 2013) చేసిన ఛేజింగ్స్‌ వెనక్కి వెళ్లాయి.

►5 అంతర్జాతీయ టి20ల్లో ఐదుసార్లు ఛేజింగ్‌లో 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి విజయం సాధించిన తొలి జట్టుగా భారత్‌ గుర్తింపు పొందింది.  

►94 భారత కెపె్టన్‌ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరు 90 నాటౌట్‌ (2016లో అడిలైడ్‌లో ఆ్రస్టేలియాపై) ఉండేది. 

కోహ్లి గేర్‌ మారిందిలా...
►1–10 బంతులు:
►7 పరుగులు
►11–20 బంతులు:
►13 పరుగులు
►21–30 బంతులు:
►19 పరుగులు
►31–40 బంతులు:
►28 పరుగులు
►41–50 బంతులు:
►27 పరుగులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top