గెలుపు కాదు... ఓటమి పలకరింపే 

Ind vs Eng 1st Test Day 4: Kohli heroics in vain; England win by 31 runs - Sakshi

తొలి టెస్టులో 31 పరుగులతో భారత్‌ పరాజయం విజయ తీరం చేర్చలేకపోయిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

దెబ్బకొట్టిన బెన్‌ స్టోక్స్‌ (4/40)

9 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్టు

మన లోలోపల ఉన్న ఆందోళనే నిజమైంది! క్లిష్టమైనా, కష్ట సాధ్యం కాని లక్ష్యంలో సగంపైగా పరుగులు ముందు రోజే చేసేసినా... మిగిలిన ఆ కొంత కొండంతలా కనిపించాయి! స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్య ప్రభావం స్పష్టంగా కనిపించిన వేళ... విదేశీ గడ్డపై మరో టెస్టు సిరీస్‌ను భారత్‌  పరాజయంతోనే ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌ మాదిరిగా లోయర్‌ ఆర్డర్‌ను కాపాడుకుంటూ అద్భుతం చేస్తాడనుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెనుదిరగడం ఆలస్యం... భారత్‌ విజయం ఆశలకు తెరపడింది. ఇంగ్లండ్‌ గెలుపునకు తెరలేచింది. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో తమకే ‘ఎడ్జ్‌’ ఉంటుందని ఆతిథ్య జట్టు మరోసారి చాటింది! అచ్చొచ్చిన చోట... 1000వ టెస్టును విజయంతో ముగించి మధురానుభూతిగా మిగుల్చుకుంది.  

బర్మింగ్‌హామ్‌: ఊరించిన విజయం చేజారింది. ఒంటరి పోరాటాలతో నాలుగో ఇన్నింగ్స్‌లో మోస్తరు లక్ష్యానైన్నా అందుకోలేమని టీమిండియాకు మళ్లీ అనుభవమైంది. ఆల్‌రౌండర్లు ఆపద్బాంధవులుగా నిలవడంతో తొలి టెస్టులో కోహ్లి సేనపై ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 110/5తో శనివారం ఆట ప్రారంభించిన భారత్‌... 162 పరుగులకు ఆలౌటైంది. విజయానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్‌ కోహ్లి (93 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ శతకం అనంతరం కీలక సమయంలో ఔటవ్వడం భారత అవకాశాలను దెబ్బతీసింది. హార్దిక్‌ పాండ్యా (61 బంతుల్లో 31; 4 ఫోర్లు) ప్రతిఘటన జట్టును గట్టెక్కించలేకపోయింది. బెన్‌ స్టోక్స్‌ (4/40) వీరిద్దరినీ ఔట్‌ చేశాడు. ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపిన సామ్‌ కరన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 9 (గురువారం) నుంచి లార్డ్స్‌లో జరుగుతుంది. 

ఈసారి స్ట్రోక్‌ స్టోక్స్‌ది... 
నాలుగో రోజు విజయానికి భారత్‌ చేయాల్సిన పరుగులు 84. కోహ్లికి తోడుగా ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ (20) కొంతైనా స్కోరు జోడిస్తే లక్ష్యం క్రమంగా కరిగేది. కానీ, అతడు తొలి ఓవర్‌ చివరి బంతికే అండర్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కెప్టెన్‌కు జత కలిసిన పాండ్యా... ఉత్కంఠ పరిస్థితులను అధిగమించి కుదురుకున్నాడు. కోహ్లి కంటే అతడికే స్ట్రయికింగ్‌ ఎక్కువగా వచ్చింది. ఇద్దరూ రక్షణాత్మకంగానే ఆడటంతో 7 ఓవర్లలో 11 పరుగులే వచ్చాయి. ఇటు బ్రాడ్‌ బౌలింగ్‌లో పాండ్యా, అటు అండర్సన్‌ బౌలింగ్‌లో కోహ్లి చెరో బౌండరీ బాదడంతో ఎట్టకేలకు స్కోరులో కదలిక వచ్చింది. ఈ క్రమంలో కోహ్లి అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అనంతరం బ్రాడ్‌ బౌలింగ్‌లో పాండ్యా రెండు ఫోర్లు కొట్టడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గుతున్నట్లు కనిపించింది. అప్పటికి లక్ష్యం 53 పరుగులే కావడం... ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రమాదాన్ని గ్రహించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ వెంటనే బౌలింగ్‌లో మార్పు చేశాడు. అండర్సన్‌ బదులు స్టోక్స్‌ను బరిలో దించాడు. ఇది ఫలితం ఇచ్చింది. స్టోక్స్‌ ఫుల్‌ డెలివరీని లెగ్‌ సైడ్‌ ఫ్లిక్‌ చేసేందుకు ప్రయత్నించిన కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఎల్బీ ఇవ్వగా, విరాట్‌ రివ్యూ కోరినా ప్రతికూలంగానే వచ్చింది. ఇదే ఓవర్‌ చివరి బంతిని షార్ట్‌ లెంగ్త్‌లో వేయగా... షమీ (0) బ్యాట్‌ను తాకుతూ బంతి కీపర్‌ బెయిర్‌ స్టో చేతుల్లోకి వెళ్లింది. దీంతో పరిస్థితి 141/6 నుంచి 141/8కి మారింది. ఇషాంత్‌ శర్మ (11) స్టోక్స్‌ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టడంతో లక్ష్యం 40ల్లోకి వచ్చింది. కానీ రషీద్‌ అతడిని ఎల్బీగా వెనక్కు పంపాడు. ఆఖరి వికెట్‌కు పాండ్యా –ఉమేశ్‌ (0 నాటౌట్‌) జంట నాలుగు ఓవర్ల పాటు బండి లాగించి 8 పరుగులు జోడించింది. ఆఫ్‌ స్టంప్‌పై పడిన స్టోక్స్‌ బంతి పాండ్యా బ్యాట్‌ను ముద్దాడుతూ స్లిప్‌లోని కుక్‌ చేతుల్లో çపడటంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. శనివారం 18.2 ఓవర్లు ఆడిన టీమిండియా 52 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 

ఇదంతా ఓ కలలా ఉంది. నమ్మలేక పోతున్నాను. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ల సాయంతో విరాట్‌ కోహ్లి ఆడిన తీరు నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నించా.  రెండో రోజు ఆట తర్వాత హోటల్‌లో కుమార సంగక్కరతో మాట్లాడా. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్‌ ఎలా చేయాలో అతడు చెప్పాడు. ఇంతమంది జనం మధ్య, నేను చూస్తూ పెరిగిన ఆటగాళ్లతో కలిసి ఆడుతూ రోజూ ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా.  
– సామ్‌ కరన్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top