కొరియా సిటీ ఇంచియాన్‌లో 17వ ఆసియా క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి.
ఇంచియాన్: నాలుగేళ్లకోసారి కనువిందు చేసే ఆసియా గేమ్స్‌కు సర్వం సిద్ధమైంది. కొరియా సిటీ ఇంచియాన్‌లో 17వ ఆసియా క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఆసియా ఖండానికి చెందిన 45 దేశాల నుండి సుమారు 10 వేల మంది ప్లేయర్లు తమ క్రీడా కౌశలాన్ని ఈ వేదికలో ప్రదర్శించేందుకు ఆరాట పడుతున్నారు. ఈ మెగా క్రీడలకు మూడోసారి ఆతిథ్యమిస్తున్న కొరియా... వీటి నిర్వహణ ద్వారా తమ సత్తా ప్రపంచానికి చూపాలని భావిస్తోంది. ఆసియా క్రీడల ఆరంభానికి ముందే కొరియా అదుర్స్ అనిపించుకుంది. అందుకు కారణం క్రీడల్ని విజయవంతం చేసేందుకు ఆతిథ్య దేశం చేసిన ఏర్పాట్లే.
ఇక కొరియా ‘డైవర్సిటీ షైన్స్ హియర్’ స్లోగన్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆసియాలో ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నా... భిన్నత్వం ఇక్కడ మెరిసిపోతుందంటూ కొరియా అన్ని దేశాల మనసును గెలుచుకుంది. ఆసియా క్రీడల్ని దక్షిణ కొరియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్లుగానే భారీగా నిధులను ఖర్చు చేసింది. ఏషియాడ్ కోసం 162 కోట్ల అమెరికా డాలర్లు (రూ. 9720 కోట్లు) వెచ్చిస్తోంది. పోటీలు పూర్తయ్యే వరకు ఈ ఖర్చు పదివేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. మొత్తం బడ్జెట్‌లో కొరియా ప్రభుత్వం 19 శాతం, మిగిలినది ఇంచియాన్ ప్రభుత్వం భరించనుంది.