ఎలా ఉన్నా సానుకూలంగానే నిష్క్రమిస్తాం : పాక్‌ క్రికెటర్‌

Imam Ul Haq Says No World Cup Let Up From Pakistan Against Bangladesh - Sakshi

ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరేందుకు శాయశక్తులా పోరాడతామని పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఇమాముల్‌ హక్‌ పేర్కొన్నాడు. అదే విధంగా మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా సానుకూల దృక్పథంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తామన్నాడు. కాగా ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై.. ఇంగ్లండ్‌ విజయం సాధించడంతో పాక్‌ సెమీస్‌ దారులు మూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మెగాటోర్నీలో నిలవాలంటే బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా పాక్‌ మొదట బ్యాటింగ్‌ చేయాలి. కనీసం 316 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అలా అయితేనే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే వన్డే చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ తేడాతో ఏ జట్టూ గెలిచిన దాఖలాలు లేవు. ఒకవేళ బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే మాత్రం ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా పాకిస్తాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించడం లాంఛనమే.

ఈ నేపథ్యంలో ఇమాముల్‌ హక్‌ మాట్లాడుతూ..‘ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓటమి నన్నెంతగానో నిరాశకు గురిచేసింది. ఆ మ్యాచ్‌లో నేను కుదురుగానే ఆడాను. నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ నిలకడగా ఆడుతూ మెగాటోర్నీలో అతి శక్తిమంతమైన జట్టును ఓడించాలని భావించాను. జట్టు కోసం మ్యాచ్‌ గెలవాల్సింది. కానీ అలా జరుగలేదు. నాపై జట్టు, అభిమానులు పెట్టుకున్న ఆశలు నిలబెట్టుకోలేకపోయాను. ఈ టోర్నీలో నాకు మంచి ఆరంభాలే లభించినా చివరికంటా పోరాడలేకపోయాను. అయితే నేను ఇంకా చిన్నవాడినే. ఈ ప్రపంచకప్‌లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. భవిష్యత్తులో ఇవి నాకెంతగానో ఉపయోగపడతాయి. ఇక మేము సెమీస్‌ చేరనప్పటికీ సానుకూలంగానే టోర్నీ నుంచి నిష్ర్రమిస్తాం’ అని 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇమాముల్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మెగాటోర్నీలో మొత్తంగా 205 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక పాక్‌ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాతో ఆడనున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top