నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా!

Imad Wasim requests Virat Kohli with folded hands to get out - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 89 పరుగుల తేడాతో(డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం) విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌లో కుమ్మేసిన భారత్‌.. ఆపై పాకిస్తాన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా భారీ గెలుపును అందుకుంది. ఈ వరల్డ్‌కప్‌కే హైలైట్‌గా నిలిచిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(140) భారీ సెంచరీకి తోడు కేఎల్‌ రాహుల్‌(57)లు శుభారంభం అందించారు. అటు తర్వాత విరాట్‌ కోహ్లి((77) తన మార్కు ఆటను చూపిస్తూ పాక్‌ బౌలర్లకు చెమటలు పట్టేలా చేశాడు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోగా, అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
(ఇక్కడ చదవండి: కోహ్లికి ఎందుకంత తొందర?)

కోహ్లి బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతనికి పాక్‌ స్పిన్నర్‌ ఇమాద్‌ వసీం దండం పెడుతూ కనిపించాడు. ‘నువ్వు కొట్టింది ఇక చాలు. ఇక ఆపరా నాయనా. నీ వికెట్‌ను ఇకనైనా ఇస్తే బాగుంటుంది’ అని అర్థం వచ్చేలా దండం పెట్టడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో కొన్ని విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన కోహ్లి ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కాగా, పాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించి కష్టాల్లో పడ్డ సమయంలో వర్షం కురిసింది. దాంతో పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులకు కుదించారు. అయితే పాక్‌ టార్గెట్‌ ఛేదించడంలో విఫలమైంది. ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగుల మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top