ఐసీసీ రిఫరీగా  తెలుగు మహిళ 

ICC welcomes first female match referee and boosts numbers on development panel - Sakshi

జీఎస్‌ లక్ష్మి అరుదైన ఘనత  

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మ్యాచ్‌ రిఫరీ ప్యానెల్‌లో తొలిసారి ఒక మహిళకు చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వ (జీఎస్‌) లక్ష్మి ఆ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇకపై ఏ అంతర్జాతీయ మ్యాచ్‌కైనా లక్ష్మి రిఫరీగా వ్యవహరించవచ్చని ఐసీసీ ప్రకటించింది. 51 ఏళ్ల లక్ష్మి ఇప్పటి వరకు కేవలం మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లకే (3 వన్డేలు, 3 టి20లు) రిఫరీగా పని చేసింది. తాజా మార్పు తర్వాత ఆమె అన్ని మ్యాచ్‌లకు ఆ బాధ్యతను నిర్వహించేందుకు అర్హత లభించింది. గతవారం బీసీసీఐ ప్రయోగాత్మకంగా నిర్వహించిన మహిళల టి20 చాలెంజ్‌ కప్‌లోనూ లక్ష్మి మ్యాచ్‌ రిఫరీగా పని చేసింది. పురుషుల క్రికెట్‌లో ఇటీవల తొలిసారి క్లాయెర్‌ పొలొసాక్‌ తొలి సారి అంపైర్‌గా వ్యవహరించి అరుదైన ఘనత నమోదు చేయగా... ఇప్పుడు లక్ష్మికి రిఫరీగా అవకాశం దక్కింది. ఐసీసీ అంపైర్‌ డెవలప్‌మెంట్‌ ప్యానెల్‌లో ఇప్పటికే ఏడుగురు మహిళలు ఉండటం విశేషం.

‘మహిళలను ప్రోత్సహించాలనే ఐసీసీ ప్రణాళికల్లో ఇదో ముందడుగు. అయితే లక్ష్మి ఎంపిక పూర్తిగా ప్రతిభపైనే ఆధార పడి జరిగింది. ఇక ముందు కూడా ఆమె పనితీరును బట్టే ముందుకు వెళుతుంది తప్ప మహిళ అని మాత్రం కాదు’ అని ఐసీసీ స్పష్టం చేసింది. రిఫరీ ప్యానెల్‌లో ఎంపిక కావడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఇన్నేళ్ల అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకముందని ఈ సందర్భంగా లక్ష్మి విశ్వాసం వ్యక్తం చేసింది.  రాజమండ్రిలో జన్మించిన లక్ష్మి... తండ్రి శేషగిరి శర్మ టాటా ఇంజినీరింగ్‌ లోకోమోటివ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె విద్యాభ్యాసం జంషెడ్‌పూర్‌లో జరి గింది. బిహార్, ఆంధ్ర, ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్, రైల్వేస్‌ జట్లకు ఆమె ప్రాతినిధ్యం వహించిన లక్ష్మి ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పీఆర్‌ఓ కార్యాలయంలో చీఫ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోంది.    
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top