భారత్‌ మా అనుమతి తీసుకుంది: ఐసీసీ

ICC Responds To Pakistan Cricket Board Claims - Sakshi

పీసీబీకి స్పష్టం చేసిన ఐసీసీ

దుబాయ్‌ : పుల్వామా ఉగ్రదాడి అమర జవాన్ల స్మారకార్థం టీమిండియా ఆటగాళ్లు మిలిటరీ క్యాపుల ధరించడాన్ని తప్పుబడుతూ గగ్గోలు పెట్టిన దాయాదీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధరించడంతో పాటు తమ మ్యాచ్‌ ఫీజును నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని భూతద్దంలో చూసిన పీసీబీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బోర్డు(బీసీసీఐ) క్రికెట్‌ను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపిస్తూ ఐసీసీకీ ఫిర్యాదు చేసింది.

గతంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్‌ తాహిర్‌, మొయిన్‌ అలీ మైదానంలో రాజకీయాల గురించి మాట్లాడరని, వారిపై ఐసీసీ తీసుకున్న చర్యలే టీమిండియా ఆటగాళ్లపై కూడా తీసుకోవాలని పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి డిమాండ్‌ చేశారు. క్రికెట్‌లో రాజకీయాలను మిళితం చేసి బీసీసీఐ తనకు ఉన్న విశ్వసనీయతను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పీసీబీ లేఖపై ఐసీసీ స్పందించింది. ఉగ్రదాడిలో అమరులైన సైన్యానికి నివాళులుగా ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి దిగుతున్నట్లు బీసీసీఐ తమ దగ్గర అనుమతి తీసుకుందని స్పష్టం చేసింది. దీనికి ఐసీసీ కూడా సమ్మతం తెలిపిందని ఓ ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ.. ఐసీసీ దగ్గర అనుమతి తీసుకున్న ఉద్దేశానికి.. ఆచరణకు చాలా తేడా ఉందని, ఈ విషయంలో తమ లాయర్లతో చర్చించి ఐసీసీకి మరోసారి లేఖ రాస్తామని పీసీబీ పేర్కొంది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top