‘టీమిండియా పేస్‌ దెబ్బకు బెంబేలెత్తిపోయా’

I Was Scared Of Indian Seamers, Marcus Reveals - Sakshi

మెల్‌బోర్న్‌: భారత క్రికెట్‌ పేస్‌ బౌలింగ్‌పై ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొన్నేళ్లుగా భారత్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగం అత్యంత పటిష్టంగా మారిపోయిందంటూ కొనియాడాడు. ప్రధానంగా జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మల పేస్‌ త్రయాన్ని పొగడ్తల్లో ముంచెత్తాడు. దీనిలో భాగంగా 2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ వచ్చిన సందర్భంలో ఆ జట్టు పేస్‌ బౌలింగ్‌ విభాగం తనకు సవాల్‌గా మారిపోయిందనే విషయాన్ని హారిస్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ ఆ పర్యటనలో టీమిండియా పేస్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడానికి హడలిపోయా. ప్రత్యేకంగా పెర్త్‌లో జరిగిన టెస్టులో భారత్‌ పేసర్లు నన్ను విపరీతంగా భయపెట్టారు.(ఇది ధోని రీఎంట్రీకి సంకేతమా?)

టీవీల్లో చూస్తే పేస్‌లో దూకుడు అంతగా కనిపించి ఉండకపోవచ్చు. కానీ బుమ్రా, ఇషాంత్‌, షమీ, ఉమేశ్‌ యాదవ్‌లు భీకరమైన బంతులతో చెలరేగిపోయారు. ప్రధానంగా మధ్య ఓవర్లలో వారు మరింత ప్రమాదకరంగా మారిపోయారు ’అని అమెజాన్‌ ఇటీవల విడుదల చేసిన సిరీస్‌ ‘ద టెస్టు’లో హారిస్‌ తన గత అనుభవాలను పంచుకున్నాడు. ఆనాటి పెర్త్‌ టెస్టులో హారిస్‌ హెల్మెట్‌కు బంతి బలంగా తగలడంతో ఆసీస్‌ శిబిరంలో ఆందోళన వ్యక్తమైంది. . ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన బౌన్సర్‌ హారిస్‌ హెల్మెట్‌కు తాకింది. ఆ సమయంలో నాలుగు పరుగుల వద్ద ఉన్న హారిస్‌.. హెల్మెట్‌ను మార్చుకుని మళ్లీ ఆడటానికి సిద్ధమయ్యాడు. కాగా, హారిస్‌ 20 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌ను భారత్‌ కోల్పోయింది. ఇదిలా ఉంచితే, టెస్టు సిరీస్‌ను మాత్రం భారత్‌ 2-1తేడాతో కైవసం చేసుకుంది. పెర్త్‌ టెస్టులో భారత్‌ ఓటమి పాలైనప్పటికీ రెండు టెస్టులను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ డ్రా అయ్యింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top