ఇది ధోని రీఎంట్రీకి సంకేతమా?

BCCI Shares MS Dhoni Photo On Twitter - Sakshi

న్యూఢిల్లీ: ‘భారత క్రికెట్‌ జట్టులో ఎంఎస్‌ ధోని పునరాగమనం చేయడం కష్టమే. ధోని స్థానంలో ఆటగాడిని భర్తీ చేయడానికి బీసీసీఐ ఎంతో ముందుకు వెళ్లిపోయింది. జట్టులో ధోనికి చోటు ఎక్కడుంది.. ఇక భారత జట్టులో ఆడలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్‌ను చూసుకుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలోఅద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా ధోని గురించి ఆలోచించేందుకు కారణం ఏముంటుంది’ అని ఇటీవల మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే అదే బీసీసీఐ ధోని ఫోటోను ట్వీటర్‌లో షేర్‌ చేసింది. చాలా కాలం తర్వాత ధోని ఫొటోను బీసీసీఐ షేర్‌ చేయడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇక్కడ ‘ నవ్వడం అనేది సంతోషానికి మార్గం’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.(‘పంత్‌.. కాపీ చేసి ఒత్తిడిలో పడొద్దు’)

దాంతో ధోని రీఎంట్రీకి ఇది సంకేతమని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ధోని ఉంటాడా.. లేదా అనే సందిగ్థంలో ఉన్న అభిమానులు బీసీసీఐ ఫోటోతో ఖుషీ అవుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. అప్పటిలోపు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ధోని ఆశించాడు. ఈ మేరకు ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సత్తాచాటాలనే ఉద్దేశంతో మార్చి తొలి వారం నుంచే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌ 2020 సీజన్‌ని ఏప్రిల్ 15కి బీసీసీఐ వాయిదా వేసింది. దేశంలో పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో టోర్నీ జరగడం దాదాపు కష్టంగానే కనబడుతోంది. కరోనా ప్రభావంతో తగ్గితే మినీ ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. 

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉన్న ధోని.. బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా ఇప్పటికే చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటించాలని యోచిస్తున్న మిస్టర్‌ కూల్‌.. కెరీర్‌ని ఘనంగా ముగించాలని ఆశిస్తున్నాడు. అందుకు టీ20 ప్రపంచకప్‌ని వేదికగా ఎంచుకున్నా.. అప్పటిలోపు టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఉన్న ఏకైక మార్గం ఐపీఎల్‌లో రాణించడమే. కానీ.. ఇప్పుడు ఐపీఎల్ రద్ద దిశగా అడుగులు పడుతుండటంతో ధోని  అభిమానుల్లో టెన్షన్‌ షురూ అయ్యింది. అయితే.. బీసీసీఐ పోస్ట్‌ చేసిన ఫొటోతో ధోనిని మళ్లీ టీమిండియా జెర్సీలో చూస్తామని అతని అభిమానులు ధీమాగా ఉన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top