‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’

I was Dropped, Became Even A Better Player, Wasim Jaffer - Sakshi

న్యూఢిల్లీ:  తాను ఆటగాడిగా ఎంతో మెరుగైన తర్వాత భారత జట్టులో చోటు దక్కకపోవడం నిరాశనే మిగిల్చిందని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ వసీం జాఫర్‌ పేర్కొన్నాడు.  తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఒక క్రికెటర్‌గా మరింత పరిణితి సాధించిన తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ వెలితిగానే ఉందన్నాడు. 2000వ సంవత్సరంలో అరంగేట్రం చేసిన జాఫర్‌.. 2008లో చివరి టెస్టు ఆడాడు. తన కెరీర్‌లో 31 టెస్టులను మాత్రమే జాఫర్‌ ఆడాడు. ప్రస్తుతం ఉత్తరాఖాండ్‌ జట్టుకు కోచ్‌గా ఉన్న జాఫర్‌..  క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ పలు విషయాల్ని షేర్‌ చేసుకున్నాడు. ( ‘ఏబీ రిటైర్‌ అయ్యాడు.. ఇక భయం లేదు’)

దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణించిన జాఫర్‌కు భారత తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్న జాఫర్‌.. తాను మెరుగైన తర్వాత ఒక్క అవకాశం కూడా దక్కకపోవడం అసంతృప్తిగా ఉందన్నాడు. ఇక సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల్లో ఎవరు అత్యుత్తమ పరిమిత ఓవర్ల ఆటగాడు అనే దానిపై జాఫర్‌ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. సచిన్‌, రోహిత్‌ల కంటే కోహ్లినే వైట్‌బాల్‌  క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడన్నాడు. ఇందుకు అతను నమోదు చేసిన గణాంకాలు, యావరేజ్‌లే కారణమన్నాడు. తాను ఆడిన కెప్టెన్లలో సౌరవ్‌ గంగూలీనే  అత్యుత్తమం అని పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సంక్షోభం తర్వాత కెప్టెన్సీ బాధ్యతల్ని భుజాన వేసుకున్న గంగూలీ.. టీమిండియాకు దూకుడు నేర్పాడన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌కు పరిచయం కావడంలో గంగూలీదే క్రెడిట్‌ అని స్పష్టం చేశాడు. తాను నమ్మిన సహచర క్రికెటర్లకు గంగూలీ ఎప్పుడూ అండగా ఉండేవాడన్నాడు. (‘కోహ్లితో కంటే వారితో పోలికనే ఆస్వాదిస్తా’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top