
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగమయ్యే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన క్రీడాకారులు ఆదిత్య, సంస్కతి వాడకట్టు అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ ‘బాల్ కిడ్స్’గా వ్యవహరించనున్నారు. కియా మోటార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆస్ట్రేలియన్ ఓపెన్ బాల్ కిడ్స్ ఇండియా ప్రోగ్రామ్’ ద్వారా భారత్‌లోని పది మంది క్రీడాకారులు ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
మొత్తం 10 నగరాల్లో నిర్వహించిన సెలక్షన్స్‌లో 250 మంది ఈ అవకాశం కోసం పోటీపడగా మెరుగైన ప్రతిభ కనబరిచిన పది మందిని ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఆదిత్య బీఎంవీ, 15 ఏళ్ల సంస్కతి చోటు దక్కించుకున్నారు.
బాల్ కిడ్స్‌గా ఎంపికైనవారి జాబితా: ఆదిత్య, సంస్కతి (హైదరాబాద్), అథర్వ హితేంద్ర (అహ్మదాబాద్), అత్రిజో సేన్‌గుప్తా (కోల్‌కతా), దివ్యాన్షు పాండే, హర్షిత్ పండిత (గురుగ్రామ్), రిజుల్ భాటియా (పంచకుల), సర్గమ్ సింగ్లా (చండీగఢ్), శారి్వన్ కౌస్తుభ్ (ముంబై,’ యశ్‌వర్ధన్ గౌర్ (చండీగఢ్).