భారత క్రికెట్ జట్టులో నెలకొన్న కార్పొరేట్ ప్రకటనల యుద్ధం.... సచిన్ వీడ్కోలు అంశానికి విలువ లేకుండా చేసింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చేసిన నిర్వాకం వల్ల దిగ్గజ బ్యాట్స్‌మన్ శతకాలకు గుర్తింపు లేకుండా పోయింది.
ముంబై: భారత క్రికెట్ జట్టులో నెలకొన్న కార్పొరేట్ ప్రకటనల యుద్ధం.... సచిన్ వీడ్కోలు అంశానికి విలువ లేకుండా చేసింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చేసిన నిర్వాకం వల్ల దిగ్గజ బ్యాట్స్‌మన్ శతకాలకు గుర్తింపు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే... వాంఖడేలో కెరీర్ చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని ఎంసీఏ ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగా స్టేడియం రూఫ్ భాగంలో మాస్టర్ చేసిన 51 టెస్టు సెంచరీల యాక్షన్ ఫొటోలను, ప్రత్యర్థి జట్ల పేరును బిల్‌బోర్డు రూపంలో పెట్టాలని భావించింది. అయితే పత్రికల్లో, మ్యాగజైన్‌లలో వచ్చిన ఫొటోలను ఎన్‌లార్జ్ చేయడంతో అవి సాధారణ కంటికి కనిపించడం లేదు. కానీ వాటి పక్కనే ఉన్న విరాట్ కోహ్లి యాడ్ బిల్‌బోర్డ్ మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. చాలా రోజుల ముందే ఈ ప్రకటనకు సంబంధించిన కంపెనీ బిల్ బోర్డును ప్రత్యేకంగా తయారు చేయించింది.
దీంతో మాస్టర్ ఫొటోలను అది పూర్తిగా డామినేట్ చేస్తోంది. ఈ విషయంపై ఎంసీఏ అధికారులను అడిగితే ఏం చేయాలో తెలియడం లేదని సమాధానమిచ్చారు. ‘ఓ కంపెనీకి స్టేడియం లోపలి హక్కులను కట్టబెట్టారు. దీంతో రాష్ట్ర సంఘానికి ఆ డీల్ గురించి పెద్దగా తెలియదు. మొత్తానికి సచిన్ బిల్ బోర్డును కోహ్లి ఫొటో డామినేట్ చేస్తోంది. అయితే ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సచిన్ బిల్‌బోర్డు పక్కన ఎలాంటి ఫొటోలు పెడతారనే దానిపై ఆలోచన చేయలేదు’ అని అధికారులు తెలిపారు.