హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతం | HCA Election Process Over, Results to be Declared After High Court Order | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతం

Jan 18 2017 1:29 AM | Updated on Aug 31 2018 8:53 PM

హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతం - Sakshi

హెచ్‌సీఏ ఎన్నికలు ప్రశాంతం

నోటిఫికేషన్‌ వెలువడిన నాటినుంచి అనూహ్య పరిణామాలతో ఆసక్తి రేపిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు మంగళవారం ముగిశాయి.

కోర్టు ఉత్తర్వుల తర్వాతే ఫలితాల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నోటిఫికేషన్‌ వెలువడిన నాటినుంచి అనూహ్య పరిణామాలతో ఆసక్తి రేపిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఇరు వర్గాల మధ్య వాదవివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది ఎదురు కావచ్చని భావించినా... చివరకు ఎలాంటి నిరసన, సమస్య లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఆరు పదవుల కోసం మొత్తం 19 మంది పోటీ పడ్డారు. మొత్తం ఓటర్ల సంఖ్య 216 కాగా, ఎన్నికల్లో 207 ఓట్లు పోలయ్యాయి. రిటర్నింగ్‌ అధికారి కె.రాజీవ్‌ రెడ్డి ఈ ఎన్నికలను పర్యవేక్షించారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్, విద్యుత్‌ జైసింహ మధ్య పోటీ నెలకొంది. కార్యదర్శి స్థానానికి శేష్‌ నారాయణ్‌ మాత్రమే పోటీ పడ్డారు. ఉపాధ్యక్ష పదవికి అనిల్‌ కుమార్, ఇమ్రాన్‌ మెహమూద్‌... సంయుక్త కార్యదర్శి స్థానానికి వంకా ప్రతాప్, అజ్మల్‌ అసద్‌ బరిలో నిలిచారు.

అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధమైన భారత మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ నామినేషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి  కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించగా, ఫలితాలను మాత్రం ప్రకటించరాదంటూ హైకోర్టు గత వారం ఆదేశించింది. దాంతో ప్రస్తుతానికి బ్యాలెట్‌ బాక్స్‌లను ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. మరోవైపు ఈ ఎన్నికలు మొత్తం లోధా కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ బుధవారం విచారణకు రానుంది. అందువల్ల నేడు ఎన్నికల చెల్లుబాటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  తన నామినేషన్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ అజహరుద్దీన్‌ మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement